Site icon vidhaatha

PM Modi | ఆమెకు ప్రధాని మోదీ ఫోన్‌.. శక్తి స్వరూపం అంటూ పొగడ్త.. ఇంతకూ ఎవరామె..?

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఓ సాదాసీదా మహిళకు ఫోన్‌ చేశారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆమెలోని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శక్తి స్వరూపంగా అభివర్ణించారు. ఇంతకూ ఎవరామె.. అనుకుంటున్నారా..? ఆమెనే పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం సందేశ్‌ఖాలి (Sandeshkhali)లోని టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ బాధితురాలు, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బసిర్‌హట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రా. షాజహాన్‌ షేక్‌ అకృత్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన రేఖా పాత్రాను బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది.


ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెను ‘శక్తి స్వరూపం’గా అభివర్ణించారు. నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహాల గురించి ఆరా తీయడంతోపాటు ఆమె యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ఆగడాల గురించి ఆమె ప్రధానికి వివరించారు. దాదాపు 6 నిమిషాలకు పైగా ప్రధాని ఆమెతో మాట్లాడారు.


పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు, అంతేగాక వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారికి వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం అక్కడి మహిళలు చేపట్టిన ఆందోళనలకు రేఖ పాత్రా నాయకత్వం వహించారు. షాజహాన్‌ షేక్‌, ఆయన అనుచరుల ఆగడాలపై దుమ్మెత్తిపోశారు.


దాంతో టీఎంసీ నేతల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖా పాత్రాను బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ప్రకటించింది. బసిర్‌హట్‌ స్థానం నుంచి అవకాశం కల్పించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే సందేశ్‌ఖాలి గ్రామం ఉంది. బసిర్‌హట్‌ నియోజకవర్గానికి ప్రస్తుతం తృణమూల్‌ నాయకురాలు, నటి నుస్రత్‌ జహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టిన అధికార టీఎంసీ.. వేరే వ్యక్తికి అవకాశం కల్పించింది.



Exit mobile version