Site icon vidhaatha

కంటోన్మెంట్ సీటుపై మొదలైన రాజకీయ చర్చలు


విధాత: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బీఆరెస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అంశం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ, శాసన సభ సభ్యులెవరైనా మరణిస్తే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని నిబంధన ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మరో 15 రోజుల్లో వెలువడనున్నదన్న ప్రచారం నేపథ్యంలో వాటితో పాటే కంటోన్మెంట్‌ ఉపఎన్నిక నిర్వహిస్తారా లేదా అన్న అంశంపై చర్చలు జోరందుకున్నాయి.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ఇప్పటికే కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కసరత్తు తుది దశకు చేరుకుంది.


ఈ పరిస్థితుల్లో కంటొన్మెంట్ సీటు ఖాళీయైనట్లుగా స్పీకర్‌ నుంచి రాష్ట్ర సీఈఓకు, అటు నుంచి కేంద్ర ఎన్నికల కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందించాల్సివుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తయితే లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉపఎన్నిక సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే లోక్‌సభ ఎన్నికల తర్వాతా కూడా ఉప ఎన్నిక నిర్వాహణ అవకాశం లేకపోలేదంటున్నారు.


ఏకగ్రీవమా.. పోటీనా


అటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తే ఎలాంటి రాజకీయ వైఖరి అనుసరించాలన్నదానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. కంటొన్మెంట్‌లో దివంగత ఎమ్మెల్యే సాయన్న 1994, 1999, 2004, 2014ఎన్నికల్లో టీడీపీ నుంచి, 2018ఎన్నికల్లో బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న అకస్మికంగా మృతి చెందితే ఆయనకు బీఆరెస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియాలను జరిపించలేదు. అయితే 2024ఎన్నికల్లో బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న కూతురు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది.


ప్రభుత్వం నిర్ణయం పట్ల కాంగ్రెస్‌కు మైలేజీ పెరిగింది. అయితే ఉప ఎన్నికలో లాస్య నందిత కుటుంబం నుంచి అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలన్న ప్రతిపాదనతో పాటు పోటీ పరిస్థితి ఏర్పడితే గత ఎన్నికల్లో ఆమెపై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తర్వాతా మూడో స్థానంలో నిలిచిన గద్దర్ కూతురు వెన్నెలనే తిరిగి పోటీకి పెట్టాలన్న ప్రతిపాదనలపై కాంగ్రెస్ తర్జన భర్జన చేస్తుంది. ఆయా ప్రతిపాదనలను పీసీసీ పార్టీ హైకమాండ్‌కు పంపించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై ముందస్తు కసరత్తు చేపట్టింది. ఇక బీఆరెస్ సిటింగ్ స్థానంగా ఉన్న కంటొన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ వైఖరి ఏమిటన్నది కూడా తేలాల్సివుంది.

Exit mobile version