Site icon vidhaatha

Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖుల నివాళులు

టాలీవుడ్ న‌టుడు కృష్ణ మృతి.. ప్ర‌ధాని మోదీ సంతాపం

Super Star Krishna | సాహసానికి మారుపేరైన సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం 4:09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటుగా భావిస్తూ.. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారు. నాటి కార్మిక, కర్షక లోకం ఆయన్ను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా కీర్తించే వారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఘనత‌ కృష్ణదే. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – సీఎం కేసీఆర్

కృష్ణ తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణ కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. – సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణ అని చెప్పుకుంటారు. కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – టీడీపీ అధినేత చంద్రబాబు

సూపర్ స్టార్ కృష్ణ మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ. అటువంటి మహామనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణకు అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను. – మెగాస్టార్ చిరంజీవి

ఘట్టమనేని కృష్ణ మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది.

నాన్న, కృష్ణ కలిసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నంద‌మూరి బాల‌కృష్ణ

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన కృష్ణ కౌబాయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీరని లోటు. ఆయన కుమారుడు మహేష్ బాబుకు, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. – జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్

సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ గా వెలిగి, తెలుగు ప్రజల గుండెల్లో నటశేఖరుడిగా నిలిచిన కృష్ణ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. – టీఎస్ ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనిల్ కుర్మాచ‌లం

Exit mobile version