- పొన్నాల వర్సెస్ కొమ్మూరి వర్సెస్ జంగా
- మూడు గ్రూపుల మధ్య కేడర్ విలవిల
- పొన్నాల యాత్ర కొనసాగిస్తుండగా
- కొమ్మూరి యాత్రకు సన్నద్ధం
అసలే రెండు టర్ములుగా అధికారం లేక కాంగ్రెస్ పార్టీ (Congress party) రాష్ట్రంలో అల్లాడుతోంది. ఈసారైనా అధికారంలోకి రావాలంటే పార్టీ నాయకుల మధ్య ఐక్యత ప్రధానమని కేడర్ పదేపదే చెబుతున్నా, చెవిన పెట్టే వారే లేకుండా పోయారు. పీసీసీ నాయకత్వం గ్రూపులతో కుమ్ములాడుకుంటుంటే, మేం మాత్రం ఎందుకు కలిసి ఉంటాం అంటూ జనగామ కాంగ్రెస్ (Janagama Congress) త్రిమూర్తులు బహిరంగంగానే బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పరోక్షంగా పట్టు కోసం ప్రయత్నించిన మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య (Former PCC President Ponnala Lakshmaiah), తాజా పీసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి (Kommuri Prathapara Reddy), ప్రస్తుత డిసిసి ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి (Janga Raghavareddy) బహిరంగంగానే పోటీకి దిగుతున్నారు. ఇందులో పొన్నాల వర్సెస్ కొమ్మూరిగా పరిస్థితి మారగా మధ్యలో నేనేం తక్కువ కాదంటూ జంగా అడుగేస్తున్నారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణంగా ఎన్నికల్లో ద్విముఖ, త్రిముఖ పోటీ అని ఉంటుంది. కానీ జనగామ కాంగ్రెస్ లో పార్టీ ముగ్గురు నాయకుల మధ్య మూడు గ్రూపులుగా పోటీ తీవ్రమైంది. మూడు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు పెరిగిపోయాయి. ఒకే పార్టీలో ఉంటూ ఒకరి పొడ ఒకరికి గిట్టని పరిస్థితికి దాపురించింది. జనగామ త్రిమూర్తులకు అడ్డగా మారింది వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ముగ్గురు నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నారు. ఈసారి టికెట్ నాదే అంటే నాదే అంటూ కేడర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఐక్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి.
జనగామలో హాత్ సే హాత్ జోడో కాదూ తోడో
ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాత్ సే హాత్ జూడో (Hath Se Hath Judo) యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనగామలో మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల ఈనెల మొదటి నుంచి నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు.
10 నుంచి కొమ్మూరి యాత్ర
పొన్నాల యాత్ర కొనసాగుతుండగానే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి రంగంలోకి దిగారు. పదవ తేదీ శుక్రవారం కొమురవెల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించి చర్చకు దారి తీశారు. డిసిసి ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జనగామ స్థానంపై సానుకూల సంకేతాలు వస్తే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారుగా యాత్రలు, కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.
నా అడ్డా అంటున్న పొన్నాల
తొలి నుంచి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన ఇక్కడ గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షునిగా నియామకమై 2014 ఎన్నికలను ఎదుర్కొన్నప్పటికీ అదృష్టం ఆయనకు కలిసి రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం సంగతేమో గాని జనగామలో పొన్నాల ఓటమిపాలై పార్టీలో పలుకుబడి అట్టడుగు చేరింది. పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు కోల్పోవడమే కాకుండా నియోజకవర్గం పై పట్టు సడలుతూ వచ్చింది. ఇక 2018 ఎన్నికల్లో పొన్నాల చరిష్మా పూర్తిగా కనుమరుగై ఒక దశలో జనగామ టికెట్ వస్తుందా లేదా? అని అనుమానాలు నెలకొన్నాయి.
జనగామలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు టికెట్ ఇవ్వాలని ఒక దశలో ప్రతిపాదనలు వచ్చాయి. ఆఖరి నిమిషంలో టికెట్ ఖరారు అయినప్పటికీ ఓటమి తప్పలేదు. రెండు పర్యాయాలు ఓటమితో నియోజకవర్గంలో అంటి ముట్టనట్టు వ్యవహరించారు. దీంతో కేడర్ ఇతర పార్టీలలోకి చేరిపోయి పొన్నాల పట్టు తప్పింది. ఇతరులకు అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉబలాట పడుతున్నారు. పార్టీలో సీనియర్ కావడంవల్ల అధిష్టానంతో ఇప్పటికీ సాన్నిహిత్యం ఉంది.
కొత్త ఆశలతో కొమ్మూరి ఎంటర్
గతంలో చేర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆ పార్టీని వీడారు. ఆ తదుపరి కాంగ్రెస్, వైయస్సార్సీపి, బిజెపి పార్టీతో సయోధ్య నెరిపి ఆఖరికి కాంగ్రెసులో చేరిపోయారు. పొన్నాలకు పెద్ద తలనొప్పిగా మారారు. కొమ్మూరికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమంటూ డిసిసి ప్రెసిడెంట్‌పై ఆశ పెట్టుకున్నారు.
రెండు పడవలపై జంగా కాలు
జంగా రాఘవరెడ్డి రాజకీయ ప్రస్థానం వరంగల్ నగరంలో ప్రారంభమై 2014 ముందు పాలకుర్తి నియోజకవర్గం పై కేంద్రీకరించి పనిచేశారు. 2018లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఎన్నికల్లో ఓటమితో పాలకుర్తిపై ఆశలు వదులుకున్నారు. జనగామ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ, జనగామ పై కన్నేశారు.
పీట ముడిపడిన డీసీసీ ప్రెసిడెంట్ నియామకం
ముగ్గురు ముఖ్య నాయకుల పోటీ మధ్య జనగామ డీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా పీటముడి పడింది. పొన్నాల తన అనుచరునికి ఇవ్వాలని పట్టుబడుతుండగా, కొమ్మూరి తనకు ఇవ్వాలని, రాఘవరెడ్డి నేను కూడా పోటీలో ఉన్నానంటూ ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి డిసిసి ప్రెసిడెంట్ నియామకం పెండింగ్లో పడింది. ఇదిలా ఉండగా జనగామ జిల్లా పరిధిలో స్టేషన్గన్పూర్ పాలకుర్తి జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి.
పట్టింపులేని పార్టీ అధిష్టానం
జనగామలో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కేడర్ మూడు గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ బలాన్ని నీరుగార్చారు. ఈ గ్రూపుల తగాదా ఇలాగే కొనసాగితే అధికార పార్టీ నెత్తిలో పాలు పోసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.