విధాత: అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టాలపై రైతుల పేరిట విపక్షాలు రాజకీయం చేయడం తగదని మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. వర్షాలపై ప్రభుత్వం 4 రోజుల ముందే అప్రమత్తం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని (Crop Loss) అంచనా వేయాలని అధికారులకు చెప్పామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే దీక్షలను రైతులు గమనిస్తారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతులు, సాగుకు తొలి ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్తే కాంగ్రెస్ నేతలు దాన్ని ప్రశ్నించడం లేదని మంత్రి మండిపడ్డారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌తో రైతుల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
రైతులను వెంటనే ఆదుకోవాలి: రేవంత్‌రెడ్డి
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పరిశీలించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు చెక్కులు (Cheques to Punjab Farmers) ఇచ్చివచ్చారని, ఆ చెక్కులు చెల్లకపోవడంతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు.