విధాత, అమరావతి: మొత్తానికి లేటుగా అయినా సరే నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి గుర్తింపు దక్కింది. ఆయన్ను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
తన కోసం పని చేసిన ఒక్కొక్కరిని ఏదో రూపంలో గుర్తిస్తూ వస్తున్న జగన్ మొన్ననే నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. వాస్తవానికి పోసాని మొదటి నుంచి జగన్ కు మద్దతుగా తన వాదన వినిపిస్తూ వస్తున్నారు.
టీవీ డిబేట్లలో టీడీపీ మద్దతుదారులైన మీడియా సంస్థలను దునుమాడే విషయంలో అందరికన్నా ముందు ఉంటారు. జగన్ మీద ఆ మీడియా చేసే రాజకీయ దాడిని పోసాని సమర్థంగా ఎదుర్కొంటారు. జగన్ కు మద్దతుగా నిలిచే క్రమంలో తన కమ్మ కులాన్ని సైతం నేరుగా దూషించేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఓ దశలో ఆయన అటు టిడిపి ఇటు జనసేన కార్యకర్తలు, సోషల్ మీడియా యూత్ కు ఉమ్మడి టార్గెట్ అయ్యారు. ఓసారి పోసాని ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. అనేక సందర్భాల్లో జగన్‌కు మద్దతుగా పోసాని వినిపించిన గళం, వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించిందని జగన్ భావించారు.
పలుమార్లు తనకు పదవిని ఇస్తాను అని జగన్ ఆఫర్ చేసినా తానే వద్దన్నానని పోసాని ఓపెన్ గానే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పదవిని చేపట్టేందుకు అంగీకరించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ పోస్ట్ అప్పగించారని సమాచారం