విధాత : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ పార్టీ వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అధికార సాధనలో తనవంతు పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఈ దఫా ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పార్టీకి వ్యూహకర్తగా కొనసాగుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది.
ఈ వార్తలకు బలం చేకూర్చుతూ శనివారం చంద్రబాబు ఇంటికి వెళ్లిన పీకే ఆయనతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రైవేట్ జెట్‌లో కలిసి వచ్చిన ప్రశాంత్ కిశోర్, నారా లోకేశ్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రశాంత్ కిశోర్‌తోపాటు రాబిన్ శర్మ.. సర్వే టీమ్ సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
ఏపీలోని రాజకీయ పరిస్థితులు.. తాను చేసిన సర్వేల అంశాలను పీకే ఈ భేటీలో చంద్రబాబుకు వివరించారని సమాచారం. ఇప్పటిదాకా చేసిన సర్వేల మేరకు రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల జయపజయాల అవకాశాలను బీరీజు వేసుకుని తులనాత్మకంగా వారు విశ్లేషించి చర్చించినట్లుగా పార్టీ వర్గాల కథనం. జగన్ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి? ఎన్నికల్లో పవన్‌ను ఎలా వాడుకోవాలి? బీజేపీతో కలువాలా లేక కాంగ్రెస్‌తో వెళ్లాలా? అన్న అంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతున్నది.
నాడు తీసిపారేసిన పీకేనే నేడు.. టీడీపీకి దిక్కయ్యారా !?
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీకి రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌పై అప్పట్లో చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పీకే సహాయంతో చంద్రబాబు ఎన్నికల తీరం దాటాలని ప్రయత్నిస్తున్న తీరును వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నాయి. వాళ్లపై వాళ్లకే నమ్మకం లేక పీకేను తెచ్చుకున్నారని గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను, ప్రశాంత్ కిశోర్ తోక కత్తిరిస్తానని, ఇది బీహార్ కాదని గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు వారి అవసరం కోసం మళ్లీ పీకే ముందు సాగిలపడ్డారని సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఇన్ని రోజులు పీకేను బూతులు తిట్టిన తెలుగు తమ్ముళ్లు, కుల, పచ్చ మీడియా చానళ్లు ఇక ఆయనను ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తడం మొదలు పెడతాయని ఎద్దేవా చేశారు. అపర చాణక్యుడు, ఎక్కడ పడితే అక్కడ చక్రాలు తిప్పిన చంద్రబాబుకు కూడా ప్రశాంత్ కిశోర్ అవసరం పడిందే పాపం.. బాబుకు తిప్పలు తెచ్చిన సర్వేలు అంటూ సెటైర్లతో పోస్టులు పెట్టారు.
ఇంత చేసి పీకే ముందు సాగిలా పడినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించడం సాధ్యం కాదని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పేశారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. నాడు 2019లో జగన్ ఇచ్చిన దానికన్నా మూడు రెట్లు ఎక్కువ ముట్టచెబుతామని పీకేను ఒప్పించి తెచ్చుకున్నారని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు-పీకేల భేటీపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు అంటూ చంద్రబాబు, లోకేశ్‌లపై అంబటి సెటైర్ వేశారు.