Site icon vidhaatha

ప్రీతి ఆత్మ‌హ‌త్య‌.. సైఫైనా, సంజ‌య్ అయినా ఎవ‌ర్నీ వ‌ద‌లం: KTR

విధాత‌: వ‌రంగ‌ల్ ఎంజీఎంలో పీజీ చ‌దువుతున్న వైద్య విద్యార్థిని డాక్ట‌ర్ ప్రీతి ఆత్మ‌హ‌త్య‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమ‌కొండ వేదిక‌గా స్పందించారు. ప్రీతి ఆత్మ‌హ‌త్య‌పై రాజ‌కీయం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్ర‌తిప‌క్షాలు చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు.

రాజ‌కీయం చేసేందుకు ప్ర‌య‌త్నం..

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. డాక్ట‌ర్ ప్రీతి కాలేజీలో జ‌రిగిన గొడ‌వ‌ల్లో మ‌న‌స్తాపానికి గురై చ‌నిపోయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రీతి ఆత్మ‌హ‌త్య‌ను కూడా కొంద‌రు రాజ‌కీయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రీతి చ‌నిపోతే తామంతా బాధ‌ప‌డ్డాం. త‌మ పార్టీకి చెందిన స‌త్య‌వ‌తి, ద‌యాక‌ర్ రావు, ఎంపీ క‌విత‌, ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు అని గుర్తు చేశారు.

ప్రీతి కుటుంబానికి అండగా ఉంటాం..

ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి త‌మ పార్టీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున మ‌న‌స్ఫూర్తిగా సంతాపం ప్ర‌క‌టిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. కొంత మంది త‌మ స్వార్థ రాజ‌కీయాల కోసం చిల్ల‌ర‌గా మాట్లాడొచ్చు. కానీ తాము పార్టీ, ప్ర‌భుత్వం ప‌రంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రీతికి అన్యాయం చేసిన వాడు ఎవ‌డైనా స‌రే.. వాడు సైఫ్ కావొచ్చు.. సంజ‌య్ కావొచ్చు.. ఇంకెవ‌డైనా స‌రే.. వ‌దిలిపెట్టం. త‌ప్ప‌కుండా చ‌ట్ట‌ప‌రంగా, న్యాయ‌ప‌రంగా శిక్ష వేస్తాం అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Exit mobile version