విధాత : అహంకారం..అణిచివేతలపై పోరాటాలే తెలంగాణ పునాదులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. .ఏళ్లకు ఏళ్లు అప్రజాస్వామిక..నిరంకుశ విధానాలపై పోరాడిన చరిత్ర తెలంగాణ బిడ్డలదని..అలాంటి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్
సాగించిన పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారని… అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు రేవంత్ రెడ్డి సమధానమిస్తూ బీఆర్ఎస్ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం వ్యవస్థలను నడుపుతున్నామని..2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించడంతో బలహీన వర్గాలకు చెందిన ఆనాటి మహిళా గవర్నర్ ను అవమానించేలా వ్యవహరించిందని విమర్శించారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవస్థలను సంస్థలను గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేసినమని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ కరపత్రంలా ఉందన్నారని…ప్రజలకు ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ఆయా అంశాలను ప్రస్తావిస్తుందని..ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ తమ ప్రసంగంలో వినిపించారన్నారు. ఎలక్షన్ మ్యానిఫెస్టో అంశాలను ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని, మేం అమలు చేసే వాటినే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే… గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉండదని గుర్తు చేశారు.
పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా? అని ప్రశ్నించారు. వాళ్లకు గవర్నర్ పై గౌరవం లేకనే మహిళను అవమానించారని, ఇది ప్రజా ప్రభుత్వం..ప్రజాపాలన.. మేం రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను గౌరవిస్తామన్నారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటామని, వారి సూచనలు తీసుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు సంక్షేమానికి పెద్ధపీట
తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయని, భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రూ.20624 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిదని, రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. ఎన్నికలను అడ్డు పెట్టుకుని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే..మేం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ. 7625 కోట్లు రైతు బంధు రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచిన ఘనత మా ప్రభుత్వానిదని, భూమిలేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 12 వేలు అందిస్తున్నామన్నారు. పభుత్వం వ్యాపార సంస్థ కాదని..కేంద్రంతో గొడవ పెట్టుకుని ఆనాటి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయలేదని, వరి వేస్తే ఉరే అని మాట్లాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ మేం ధాన్యం కొనుగోలు చేసి రూ.1206 కోట్లు సన్న వడ్లకు బోనస్ అందించామని, కాళేశ్వరం లేకుండానే రైతులు 1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం పండినా కాళేశ్వరంతోనే పండాయని మభ్యపెట్టారని..కాళేశ్వరం కూలి లక్ష కోట్లు వృధా అయిపోయాయన్నారు. మిల్లర్లతో కుమ్మక్కై ఆనాటి బీఆర్ఎస్ పాలకులు రైతులను దోపిడీ చేశారన్నారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు సమస్యలపై కేసీఆర్ తో ఎపుడైనా చర్చ కు సిద్ధమన్నారు.
కృష్ణా జలాలను ఏపీకి దోచి పెట్టారు
పోరాటాలు చేశామని చెప్పుకునే బీఆర్ ఎస్ పెద్దలు ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 512టీఎంసీలు మీకు.. 299 టీఎంసీలు మాకు చాలని సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది వాళ్లు కాదా? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. మేం అధికారంలోకి రాగానే కేంద్రంను కలిసి నీళ్ల కోసం కొట్లాడామని, పునఃసమీక్షకు ఒప్పించామన్నారు. వైస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా అని 40వేల క్యూసెక్కులను 80వేల క్యుసెక్కులకు ఏపీ పెంచుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టుకుంది వాళ్లే కదా అన్నారు. ఆనాడు వీళ్లు సహకరించకపోతే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదయ్యేదా? అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాలను రెండు టీఎంసీ ల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి… నీళ్లను శ్రీశైలంకి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు.
కృష్ణా జలాలపై చర్చకు రా…కేసీఆర్ కు సవాల్
ఎస్ఎల్బీసీని నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సింది పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకు కారణం మీరు కాదా అని, కృష్ణా పరివాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. మా ప్రశ్నలకు సంధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వెళ్లిపోయారని, 15 నెలల్లో కేసీఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారన్నారు. 2023 డిసెంబర్ 1నుంచి 2025 ఫిబ్రవరి 28వరకు ఎమ్మేల్యేగా కేసీఆర్ రూ. 57,84,124 జీత, భత్యాలు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందనే సెక్యురిటీ పెట్టుకుంటున్నాడని, అది వారి కుటుంబ సమస్యని చురకలేశారు. ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ కష్టాలు తీరేది కదా అని, కేసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై సభలో చర్చ పెడదామని, లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నామని, మాది తప్పయితే కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధమని, ఈ సవాలుకు కేసీఆర్ సిద్ధమా చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఆనాటి ఏపీ సీఎం జగన్ తో విందులు చేసుకుని శ్రీశైలం బ్యాక్ వాటర్ పొతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల, మల్యాల, ముచ్చుమర్రి వంటి ప్రాజెక్టులతో రోజుకు 10 టీఎంసీలు తరలించుకుపోయేలా పక్క రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే… విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టులపై ఇంప్లీడ్ అయిందన్నారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్… ఎంపీగా రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారని దుయ్బబట్టారు. పాలమూరు డిజైన్ మార్పును ప్రశ్నించిన చిన్నారెడ్డిని సభలో కేసీఆర్ అవమానించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. మేం వచ్చాక కృష్ణా పరివాహకంలో మాకు న్యాయంగా రావాల్సిన వాట కోసం కేఆర్ఎంబీ, సుప్రీంకోర్టు వద్ధ పోరాడామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఏపీ పోలీసులు, కేంద్ర బలగాలు ఎవరి హాయాంలో వచ్చాయో మరిచి మాపై విమర్శలు చేస్తారా అని విమర్శించారు.
స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పైన లేదా?
వారిని అధికారంలో నుంచి దించేసి ప్రజలే తప్పు చేశారని బీఅరెస్ నేతలు అంటున్నారని… ప్రజలను తప్పు పట్టడం ఏమిటి? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పైన లేదా? అని నిలదీశారు. బీఆరెస్ మార్చురీలో ఉందని నేను మాట్లాడానని..కేసీఆర్ ను మార్చురీకి వెలుతావని అనేంత కుంచిత బుద్ది నాకు లేదన్నారు. కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలని..ఆయన ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. మేం అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటామన్నారు. కేసీఆర్ దగ్గర తీసుకోవడానికి ఇంకా నాకు ఏముందన్నారు.
ఆడబిడ్డలకు అన్నగా ఆపన్న హస్తం
తెలంగాణలో మహిళలు నన్ను ఇంటిబిడ్డ గా చూసుకుంటున్నారని..ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 5000 స్కూల్స్ ను బీఆరెస్ మూసివేసిందన్న సంగతి మరువరాదన్నారు. అయితే స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాల కు ఇచ్చామని, 1000 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చామని, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. బతుకమ్మ చీరల పేరుతో దోపిడీ చేశారని వాటిని రద్దు చేశామని, మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని, కోటి 30 లక్షల చీరలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. రేవంతన్నా అని ఆడబిడ్డలు నన్ను ఒక అన్నలా చూస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మను అమ్మా అన్నారు..ఎన్టీఆర్ ను అన్నా అన్నారు..ఇప్పుడు నన్ను రేవంతన్నా అంటున్నారని..కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించి పోతుంటే ఒక ఆడబిడ్డ అన్నా పిలిచిందని గుర్తు చేశారు. ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నిస్తున్నామన్నారు. అన్ని యూనివర్సిటీ వీసీ నియామకాల లిస్టు తీద్దాం.. మేం సామాజిక న్యాయం చేసింది నిజమో కాదో చూద్దామన్నారు.
రాజ్యంగ వ్యవస్థలను కూడా గౌరవించారా?
వాళ్ల విలాసవంతమైన జీవితాలకు భంగం కలిగించానని వాళ్లకు నాపై కోపం ఉండొచ్చు…అని, కానీ కుల దురహంకారం ప్రదర్శించడం న్యాయమా? గవర్నర్, స్పీకర్ లను గౌరవించరు…ఏకవచనంతో సంభోదిస్తున్నారన్నారు. పైగా సమర్థించుకుంటూ ధర్నాలు చేస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు.. దావత్ లు ఇచ్చే దోస్తులు వీళ్ళేనా.. బీఆరెస్ కు కావాల్సిందని..తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆరెస్ కు పట్టదా? అని నిలదీశారు. నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నవాళ్ళు పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదు? దేశ చరిత్రలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిదన్నారు. వాళ్ల హయాంలో 22.9 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను …18.1 శాతానికి తగ్గించిన చరిత్ర మాదన్నారు. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించవద్దని మా ఎమ్మెల్యేల నుంచి మాట ఇస్తున్నా..కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మని చెప్పండని రేవంత్ రెడ్డి సూచించారు. ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోవడానికి వెళ్తున్నానా అని, సామాన్యుడిలా సాధారణ టికెట్ కొని వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులందరినీ కలిశానని స్పష్టం చేశారు. ఈ దేశ ప్రధాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటివాడేనన్నారు. వీదేశీ పెట్టుబడుల సాధనలో, కేంద్ర ప్రాజెక్టుల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రణాళిక బద్దంగా నగర అభివృద్ధి
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను పెంచే పని చేస్తున్నామని..గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ కాలుష్యరహిత నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నగరంలో ప్రతి అరగంటలో 1లక్ష కార్లు రోడ్డుపైకి వస్తున్నాయని..అపార్ట్ మెంట్లలో ఏసీల కాలుష్యానికి..డ్రైనేజీలకు సరైన ప్లానింగ్ లేదన్నారు. అపార్ట్ మెంట్లకు అనుమతి ఎకరాకు 1లక్ష 25వేలు ఉంటే మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 5లక్షలకు పెంచి లక్ష స్క్యైర్ ఫీట్లను కొట్టేసిన సంగతి సభకు వస్తే వెల్లడిస్తానన్నారు. నగరంలోని పరిశ్రమలను అవుటర్ బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకే హెచ్ఎండీఏ పరిధిని పెంచామన్నారు. ప్రణాళిక బద్దంగా నగర అభివృద్ధి చేస్తున్నామని, రియల్ ఎస్టేట్ రంగం ప్రక్షాళన చేస్తుంటే చెరువులను రక్షిస్తుంటే, మూసీ ప్రక్షాళన చేస్తుంటే అన్నింటికి అడ్డుపడటమే పనిగా పెట్టుకున్నారన్నారు.
మేం వచ్చాకా చేసిన అప్పులు రూ.4,682కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం 1లక్ష 60వేల కోట్లు అప్పులు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుందని..మేం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 1నుంచి 1లక్ష 58వే 41కోట్ల అప్పు తెచ్చామని, కేసీఆర్ చేసిన అప్పులకు రూ.88,591కోట్లు అసలు చెల్లించామని, వడ్డీ 64,768కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మొత్తం అప్పులలో 1లక్ష 53,359కోట్ల కేసీఆర్ అప్పులు, వడ్డీలకే సరిపోయిందని, నికరంగా మేం చేసిన అప్పు కేవలం 4,682కోట్లు మాత్రమేనని వెల్లడించారు. అప్పులు, వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన దుస్థితిలో కేసీఆర్ రాష్ట్రాన్ని నెట్టివేశారన్నారు. బీఆర్ఎస్ చెబుతున్న లెక్కల మేరకు రాష్ట్ర అప్పు 8లక్షలు 28,200కోట్లు ఉండాలని..కాని ఇప్పుడు 7లక్ష్లల 38వేల 707కోట్లు మాత్రమే ఉండటాన్ని గమనించాలన్నారు. చర్చకు వస్తే కేవలం అప్పుల మీదనే ఒక రోజు అసెంబ్లీలో చర్చిద్ధామని, అబద్ధాల పునాదుల మీద రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదన్నారు.