Congress
- బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తులపై ఫోకస్
- మహిళా డిక్లరషన్పై ప్రకటన
విధాత: వచ్చే ఎన్నికల్లో అధికార సాధన దిశగా దూసుకుపోతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికల స్పీడ్ పెంచేందుకు మరింత ఫోకస్ పెంచింది. ఖమ్మంలో రాహుల్‌గాంధీ బహిరంగసభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికతో మొదలైన ఘర్ వాపసీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ గూటికి చేర్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుంది.
టీ.కాంగ్రెస్ పార్టీ ఈనెల 20న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్‌రెడ్డి సహా ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలు పార్టీల ముఖ్యనేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీలో చేరనున్నారు.
కొల్లాపూర్ కాంగ్రెస్ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ హాజరుకానున్నట్లుగా తెలుస్తుండగా, ఆమె పర్యటన వివరాలను ఇంకా ఏఐసీసీ ఖరారు చేయాల్సివుంది. తెలంగాణలో చేరికలలో వేగం పెంచే వ్యూహాలకు పదును పెడుతున్న టీ.కాంగ్రెస్ నాయకత్వం, ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే చేరికలకు సిద్ధంగా ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ అసంతృప్త నాయకులతో అంతర్గత సంప్రదింపుల ప్రక్రియలో వేగం పెంచారు.
ఇప్పటికే ఖమ్మం సభా వేదికగా కాంగ్రెస్ పాతకాపులంతా తిరిగి హస్తం గూటికి చేరుకోవాలని పిలుపునివ్వడం ద్వారా రాహుల్ గాంధీ ఘర్‌వాపసీకి రెడ్ కార్పెట్ పరిచారు. బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎ.చంద్రశేఖర్ వంటి అసంతృప్త నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ నుండి సైతం మాజీ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వంటి వారు కాంగ్రెస్ నేతలతో కొంతకాలంగా టచ్‌లో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్ధి అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుండి భారీగా చేరికలుంటాయని టీ.కాంగ్రెస్ ధీమా ఉంది.
కొల్లాపూర్ సభలో మహిళా డిక్లరేషన్
తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రణాళిక హామీలను, పథకాలను ఒక్కో బహిరంగ సభ ద్వారా జనంలోకి తీసుకెలుతు వాటిని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తుంది. తొలుత వరంగల్ సభలో రైతు డిక్లరేషన్, సరూర్‌నగర్‌సభలో యూత్ డిక్లరేషన్, ఖమ్మం సభలో చేయూత ఫించన్ స్కీమ్‌లను, గాంధీ భవన్‌లో భూమి డిక్లరేషన్ ప్రకటింంచిన టీ.కాంగ్రెస్ కొల్లాపూర్ సభలో మహిళా డిక్లరేషన్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రియాంకగాంధీ హాజరుకానున్న ఈ సభలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే తీరులో కర్ణాటక తరహాలో మహిళా డిక్లరేషన్ ప్రకటనకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిపైన, మహిళా సంఘాలకు, బాలికల సంక్షేమానికి కూడా కొల్లాపూర్ సభా వేదికగా మహిళా డిక్లరేషన్ ద్వారా పథకాలు ప్రకటించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.
భట్టితో జూపల్లి భేటీ.. ఖమ్మం సభపై చర్చ
కొల్లాపూర్ సభ నిర్వాహణ సన్నాహాలపై చర్చించేందుకు జూపల్లి కృష్ణారావు సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. సభా విజయవంతం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్న విషయంతో పార్టీలో చేరికలకు సంబంధించి చర్చలు జరిపారు. పాదయాత్ర ముగించుకున్న భట్టికి శుభాకాంక్షలు తెలిపిన జూపల్లి.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభకు మించి కొల్లాపూర్ సభ ఉండాలని అందుకు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని 14నియోజకవర్గాల నుండి చేరికలతో పాటు భారీ ఎత్తున జనసమీకరణ సన్నాహాలు చేస్తున్నామన్నారు. భట్టి మాట్లాడుతూ.. జూపల్లి వంటి సీనియర్ నేత తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం పార్టీ బలోపేతానికి సహకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.