Site icon vidhaatha

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొత్త కుతంత్రాలు!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు పరమావధిగా పెట్టుకున్న బీజేపీ.. ఇతర పార్టీలను చీల్చే పనిని వేగవంతం చేస్తున్నదా? ఆఖరు నిమిషంలో సైతం ఇతర పార్టీల నుంచి నేతలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నదా? పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఒక సంకేతంగా కనిపిస్తున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి పంజాబ్‌లో ఒక్కరోజే జోడు దెబ్బలు తగిలాయి. ఆ పార్టీ జలంధర్‌ ఎంపీ సుశీల్‌కుమార్‌ రింకు, జలంధర్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే శీతల్‌ అన్గురల్‌ బుధవారం బీజేపీ శిబిరంలో చేరారు.


వాస్తవానికి జలంధర్‌ అభ్యర్థిగా రింకును ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. కానీ.. తెరవెనుక ప్రయత్నాలు ఏం జరిగాయోకానీ.. ఆయన చక్కగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఆయనతో మాట్లాడేందుకు, నచ్చజెప్పేందుకు ఆప్‌ నేతలు ప్రయత్నించినా వీలు కాలేదని సమాచారం. 2023 ఉప ఎన్నికలో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి రింకు 58,691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


ఇదిలా ఉంటే.. మంగళవారం కాంగ్రెస్‌కు చెందిన లూధియానా ఎంపీ రవ్‌నీత్‌ బిట్టును బీజేపీ తనవైపు తిప్పుకొన్నది. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే బిట్టును బీజేపీలో చేర్చుకోవడం గమనార్హం. 1995లో ఆత్మాహుతి బాంబర్ల చేతిలో చండీగఢ్‌లో హత్యకు గురైన పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ మనుమడు రవ్‌నీత్‌ బిట్టు. 13 ఎంపీ స్థానాలున్న పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఒకే విడుతలో జూన్‌ 1న నిర్వహించనున్నారు. పంజాబ్‌లో ఏడవ, చివరి విడుతలో ఎన్నికలు జరుగబోతున్నాయి.

Exit mobile version