Site icon vidhaatha

Rahul Gandhi | కాంగ్రెస్‌ నేత రాహుల్‌కు మరిన్ని కష్టాలు..! లండన్‌లో వ్యాఖ్యలపై ప్రివిలేజెట్‌ కమిటీ సీరియస్‌..!

Rahul Gandhi | కాంగ్రెస్‌ రాహుల్‌కు మరిన్ని కష్టాలు తప్పేలాలేవు. ఇప్పటికే లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుల నేపథ్యంలో సమాధానం ఇచ్చారు. తాజాగా లండన్‌ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. లోక్‌సభలో విపక్షాల గొంతును అణచివేస్తున్నారని ఆరోపిస్తూనే.. మాట్లాడుతున్న సమయంలో విపక్ష నేతల మైక్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యిందని రాహుల్‌ పేర్కొన్నారు. అయితే, రాహుల్‌ వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ సైతం విమర్శించారు.

కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు మినహా ఇతర ప్రతిపక్షాలు రాహుల్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ సందర్భంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలతో సరిపోలడం లేదని, కాంగ్రెస్‌ నేత లోక్‌సభలో ఎప్పుడు మాట్లాడిన నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయమే మాట్లాడినట్లు రికార్డులు చెబుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైక్‌ను ఆపివేశారంటూ చేసిన ఆరోపణలపై కమిటీ సీరియస్‌గా తీసుకుందని, ఈ విషయంపై కమిటీ సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని యోచిస్తున్నదని సమాచారం.

ఇప్పటికే ప్రధాని- అదానీ కేసులో..

ఇప్పటికే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను కమిటీ పరిశీలిస్తున్నది. ఎంపీ నిషికాంత్ ఠాకూర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫిర్యాదు మేరకు రాహుల్ తన వాదనను కమిటీ ముందు వినిపించారు. ఈ వారం నిషికాంత్ దూబే తన పక్షాన్ని కమిటీ ముందు హాజరుపరచనున్నారు. మరో వైపు ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతున్న రాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇతర దేశాల సహాయాన్ని కోరుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. సోమవారం ప్రారంభమైన బడ్జెట్‌ సెషన్‌ రెండో విడతలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడటానికి కారణం కూడా ఇదేనని తెలుస్తున్నది. ఈ విషయంలో రాహుల్ విచారం వ్యక్తం చేసే వరకు, లేదంటే క్షమాపణలు చెప్పే వరకు ఆయనపై వైఖరి మారదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version