Rahul Gandhi | పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆదివారం దేవవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. మరో వైపు రాహుల్ గాంధీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా బయోడేటాను అప్‌డేట్ చేశారు. ఇంతకు ముందు ఉన్న బయోను తాజాగా మార్చారు.
జాతీయ కాంగ్రెస్ సభ్యుడు, డిస్‌క్వాలిఫైడ్ ఎంపీగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ బయోడేటా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. అనర్హత వేటు అనంతరం శనివారం రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానని.. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. అదానీపై ప్రశ్నిస్తున్నందుకు దృష్టి మరల్చేందుకు ఓబీసీ వర్గాన్ని అవమానించారని బీజేపీ ఆరోపిస్తుందన్నారు.
పరువు నష్టంలో క్షమాపణలు చెబుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నా పేరు సావర్కర్ కాదు.. నా పేరు గాంధీ అనీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరన్నారు. అదానీపై తర్వాత చేయబోయే ప్రసంగానికి ప్రధాని భయపడ్డారని, మోదీ కళ్లల్లో తాను భయాన్ని చూశానన్నారు. మళ్లీ ఎంపీ సభ్యత్వం వస్తుందో లేదో తెలియదని, తనను శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా.. పార్లమెంట్‌లో ఉన్నా లేకపోయినా తాను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌లో రూ.20వేలకోట్ల పెట్టుబడి ఎవరిదని ప్రశ్నించారు. అదానీకి ఎన్నో షెల్ కంపెనీలు ఉన్నాయని, అందులో పెట్టుబడులు ఎవరు పెట్టుబడి పెట్టారో తెపాలని పార్లమెంట్‌లో ప్రధానిని ప్రశ్నిస్తే.. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు అనర్హత వేటు వేశారని ఆరోపించారు.