విధాత : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన విషయం విదితమే. కుండపోత వర్షం కురియడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు రోడ్లపైనే గంటల కొద్ది ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రంతా కూడా వర్షం దంచి కొట్టింది. అయితే మంగళవారం కూడా హైదరాబాద్‌కు వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.
నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఖాజాగూడలో 115 మి.మీ. వర్షపాతం నమోదైంది. మెహిదీపట్నంలో 114 మి.మీ., ఖైరతాబాద్‌లో 104.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా సైదాబాద్‌లో 32.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 171.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.