Rajiv Gandhi Assassination Case | భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల్లో ఒకరైన ఎస్ నళిని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దేశం విడిచి వెళ్లేందుకు వీలుగా పాస్‌పోర్ట్ కోసం భారత్‌లోని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ ఎదుట హాజరయ్యేందుకు తన భర్తను అనుమతించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. రాజీవ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. నళిని భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్ శ్రీలంక పౌరుడు కావడంతో తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారని నళిని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నళిని, మురుగన్ ఇద్దరూ సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 12, 2022న జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం నళిని దంపతులు లండన్‌కు వెళ్లాలని భావిస్తున్నది. భర్తతో కలిసి కూతురు వద్దకు వెళ్లి అక్కడే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తులు చేసుకున్నట్లు నళిని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 30న ఇంటర్వ్యూ జరిగిందని.. కానీ శ్రీలంక కాన్సులేట్ పిలిచిన సమయంలో మురుగన్ ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. అయితే, ప్రత్యేక శిబిరంలో నెల రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని.. తన భర్తకు ఏదైనా జరుగక ముందే కూతురు వద్దకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆమె పటిషన్‌లో పేర్కొన్నారు.
భద్రత కల్పించాలని..
తన భర్త పాస్‌పోర్టు పొందేందుకు వీలుగా చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్‌కు ఇంటర్వ్యూకు వెళ్లేందుకు అనుమతించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదేశించాలని కోరింది. అవసరమైతే పోలీసులకు తగిన భద్రత కల్పించేలా ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు ఎంఎస్ రమేశ్, సుందర్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సుందర్ మోహన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దేశంలోనే అత్యధిక కాలం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ నళిని కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు.
జైలులో ఉండగానే ఆడపిల్లకు జన్మ..
గత సంవత్సరం ఇచ్చిన పిటిషన్‌లో ఎస్ నళిని తనను అరెస్టు చేసినప్పుడు, తాను గర్భవతి అని పేర్కొన్నారు. డిసెంబర్ 19, 1992న జైలులో ఉన్నప్పుడు తనరే కుమార్తె జన్మించిందని తెలిపింది. ప్రస్తుతం తన కూతురు తన భర్త, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో తాను భర్తతో కలిసి లండన్‌కు వెళ్లితో కూతురుతో నివసించాలని కోరుకుంటున్నట్లు నళిని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మురుగన్ పాస్‌పోర్ట్ తీసుకొని శ్రీలంక రాయబార కార్యాలయానికి వెళ్లడానికి ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై హైకోర్టు కేంద్రం సమాధానం కోరింది.
మాజీ ప్రధాని హత్యకేసులో ప్రమేయం ఉన్న ఏడుగురు నిందితుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, అక్రమంగా భారత్‌కు వచ్చారని హోం మంత్రిత్వ శాఖ అధికారి అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ పరిస్థితిలో వారి ప్రయాణానికి సరైన పత్రాలు లేవు. అయితే, ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. నలుగురు దోషుల పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలని శ్రీలంక హైకమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. తద్వారా నలుగురిని వారి సొంత దేశానికి పంపించేందుకు అవకాశం ఉంటుంది.
ఇదీ కేసు..
రాజీవ్ గాంధీని 1991లో ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళం హత్య చేసింది. ఈ కేసులో మురుగన్‌తో పాటు సంతాన్, రాబర్ట్ పయాస్, జయకుమార్ దోషులు. ఈ నలుగురు శ్రీలంక నివాసితులు. నలుగురిని విడుదల చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో పెరారివాలన్, నళిని, రవిచంద్రన్ విడుదలయ్యారు.