Site icon vidhaatha

రాష్ట్రంలో.. వారిదే పెత్తనం!

ఉన్నమాట: ప్ర‌భుత్వ ప‌నితీరుకు కండ్లు, కాళ్లుగా అత్యున్న‌త అధికారుల‌ను ప‌రిగ‌ణిస్తారు. పాల‌న‌లో అత్యున్న‌త అధికార గ‌ణం పాత్ర విశిష్ట‌మైన‌ది. రాష్ట్రంలో కొన‌సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో సీనియ‌ర్ అధికారుల పాత్ర ప్ర‌త్యేక‌మైన‌ది. అయితే.. ఇలాంటి కీల‌క స్థానంలో గ‌త కొన్నేండ్లుగా కొంత మంది తిష్ట‌వేసి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇత‌ర అధికారులు వాపోతున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వారే అన్నింటా అధికారం చెలాయిస్తున్నార‌ని నిర్వేదం వ్య‌క్తం చేస్తున్నారు.

సీనియ‌ర్ల‌ను కాద‌ని కొంద‌రిని చేర‌ దీసి ప్ర‌స్తుత పాల‌కులు అంద‌ల‌మెక్కించి ప్రాధాన్య‌మిస్తే మొత్తం పాల‌న‌నే ఓ ముఠా కార్య‌క్ర‌మంగా దిగ‌జార్చార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఒకే ప్రాతంతానికి చెందిన ఆ ఆరుగురు అధికారులే అన్నింటా తామై వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు. ఇత‌ర‌ విభాగాల్లో సైతం వేలుపెట్టి అధికారులు ప‌నిచేయ‌లేని స్థితిని స‌ద‌రు అధికారులు తెస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన వారే త‌మ పద‌వీకాలం మొత్తం సేవ‌లందించే ప‌రిస్థితులు మృగ్య‌మ‌వుతున్న స్థితిలో అధికార గ‌ణం మాత్రం ఏండ్ల‌కేండ్లుగా సెక్ర‌టేరియట్ కేంద్రంగా చ‌క్రం తిప్పుతున్న తీరు ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీరు మొత్తం పాల‌న‌ను త‌మ క‌నుసైగ‌ల్లో న‌డుపుతున్న తీరుపై ప్ర‌భుత్వ అధికార వ‌ర్గాలు తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఉన్న‌తాధికారులు ఒకే స్థానంలో, ఒకే పోస్టులో రెండేండ్ల‌కు మించి ఉండ‌రాదన్న నిబంధ‌న ఉన్న‌ది. స‌ర్వీస్ రూల్స్ కూడా ఇదే చెబుతున్నాయి. అయినా ఈ అధికారులు అన్నింటికీ తిలోద‌కాలిచ్చి ఏండ్ల‌కు ఏండ్లుగా ఉన్న‌త స్థానాల్లో తిష్ట‌వేశారు. ఇలా అధికారంలో కొన‌సాగ‌టంపై ఉద్యోగ‌వ‌ర్గాల్లో నెల‌కొన్న తీవ్ర అసంతృప్తి అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన తీరుగా ఏదో రూపంలో వ్య‌క్త‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

Exit mobile version