Credit Card | ఇకపై మీకు నచ్చిన నెట్‌వర్క్‌తో క్రెడిట్‌ కార్డు.. ఆర్బీఐ కీలక గైడ్‌లైన్స్‌

  • Publish Date - March 7, 2024 / 06:35 AM IST

Credit Card: సాధారణంగా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు అవి చేసుకున్న ఒప్పందాల మేరకు వాటికి ఇష్టమొచ్చిన నెట్‌వర్క్‌తో వినియోగదారులకు క్రెడిట్ కార్డులు (Credit Cards) జారీ చేస్తుంటారు. ఇలా క్రెడిట్‌కార్డుల జారీ సంస్థలు, నెట్‌వర్క్‌ల ఒప్పందాలవల్ల నచ్చిన నెట్‌వర్క్‌తో క్రెడిట్‌ కార్డు తీసుకోవడంలో వినియోగదారులకు ఆప్షన్‌లు పరిమితంగా ఉన్నాయని ఆర్బీఐ గుర్తించింది. దాంతో కార్డుల ఎంపిక విషయంలో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్‌ ఉండేలా ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు జారీచేసింది.

ప్రస్తుతం అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌లు.. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలతో కలిసి వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే ఎవరరికి ఏ నెట్‌వర్క్‌ కార్డు ఇవ్వాలనేది జారీచేసే సంస్థలే నిర్ణయిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లతో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు చేసుకునే ఒప్పందాలే అందుకు కారణం. దీన్ని తాజాగా ఆర్‌బీఐ (RBI) సమీక్షించింది. కార్డు ఎంపికలో వినియోగదారులకు పరిమిత ఆప్షన్లు ఉన్నాయని గుర్తించి, ఈ పరిస్థితిని మార్చేందుకు పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం-2007 కింద తనకున్న అధికారాలను ఉపయోగించి మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు.. 

ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకూడదంటూ పరిమితులు విధించే నెట్‌వర్క్‌లతో క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు (బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు) ఒప్పందాలు చేసుకోవద్దు. నచ్చిన నెట్‌వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను జారీ సంస్థలు వినియోగదారులకు ఇవ్వాలి.

ఇప్పటికే కార్డు ఉన్నవారికి రెన్యువల్‌ సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌కు మారే అవకాశం కల్పించాలి. ఈ మేరకు అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌ల జాబితాను ఆర్‌బీఐ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, మాస్టర్‌ కార్డ్‌ ఏషియా/పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-రూపే, వీసా వరల్డ్‌వైడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొదలైనవి అందులో ఉన్నాయి.

అదేవిధంగా క్రెడిట్‌ కార్డు నెట్‌వర్క్‌లు, వాటిని జారీ సంస్థలు.. రెన్యువల్ సమయంలో తమ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఒప్పందాలను సవరించుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. అయితే పది లక్షల కంటే తక్కువ యాక్టివ్‌ కార్డులు ఉన్న జారీ సంస్థలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. అంతేగాక సొంత నెట్‌వర్క్‌ ద్వారా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్న సంస్థలకు కూడా ఈ మినహాయింపునిచ్చింది. ఈ మార్గదర్శకాలను 2024 మార్చి 6 నుంచి ఆరు నెలలోగా అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

Latest News