- సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
- తెల్గాంపూర్ భూ కుంభకోణం బయటపెడతా
- ధరణి పేరుతో భారీ కుంభకోణం
- కెసిఆర్ కుటుంబ దందా చేస్తుంది..
- యాత్రను అడ్డుకునేందుకు కుట్ర..
- ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తాం
- టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘నాపై చేస్తున్న ఆరోపణలకు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ నువ్వు చేస్తున్న భూకుంభ కోణాలపై విచారణకు సిద్ధమా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు ముఖ్యమైన ఆరోపణలు చేస్తున్నానని దీనిపై విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తెల్గాంపూర్‌లో వేల కోట్లు విలువ చేసే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి రామారావు బృందం కొల్లగొట్టిందని విమర్శించారు.
బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తే… ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు.
శేర్లింగంపల్లి మండలం మియాపూర్‌లో సర్వేనెంబర్ 80లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు 5 ఎకరాల భూమి ఎక్కడిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రూ. 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని తన పేరుపై మార్చేందుకు.. ఇప్పటికే పలుమార్లు ఎంపీ భర్త భద్రునాయక్ దరఖాస్తు చేసుకుంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.
రెడ్యా పార్టీ మార్పునకు ఇదే కారణం
ఈ భూ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన తన తండ్రి రెడ్యా నాయక్‌ను బ్లాక్ మెయిల్ చేసి, టిఆర్ఎస్‌లో చేరేందుకు ఒత్తిడి తెచ్చింది ఎంపీ కవిత కాదా? అంటూ నిలదీశారు. ఇంత విలువైన భూమి కవితకు ఎక్కడిదని సమాధానం చెప్పాలని అన్నారు. అంబేద్కర్ సెంటర్లో కవిత ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
మంత్రి రామారావు చేస్తున్న అక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలువవా అంటూ ప్రశ్నించారు. కొడుకు అరాచకాలను సీఎం పట్టించుకోవడంలేదని ధృతరాష్ట్రుడిగా మారారని విమర్శించారు. సభలో సభ్యుడు కానటువంటి వ్యక్తి పైన ఆరోపణలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం లేని సన్యాసి మంత్రి రామారావ్ అని మండిపడ్డారు. ఆరోపణల పైన తమ పార్టీ ప్రతినిధులకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా… శాసనసభను కెసిఆర్ భజన మండలిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు జిల్లాల పరిధిలో భూ దందా
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఉన్న వేలాది ఎకరాల నిషేధిత భూములను 2014 నుంచి పథకం ప్రకారం మంత్రి రామారావు గ్యాంగ్ కొల్లగొడుతుందని విమర్శించారు. ధరణి పోర్టల్‌ను తేవడమే పెద్ద కుట్రగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ బాధ్యత ఐ ఎల్ ఎఫ్ ఎస్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. దీనివల్ల మన వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు.
ధరణి పోర్టల్ భూ కోణానికి నిలయంగా మారిందని విమర్శించారు. ఈ భూదందా వెనక కేసీఆర్ కుటుంబం ఉందని ఆరోపించారు. ఈ భూ కుంభకోణాల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని… మంత్రి రామారావుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఆ జిల్లాల కలెక్టర్లదే పూర్తి బాధ్యత
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములకు అక్కడి కలెక్టర్లు బాధ్యత వహించాలని హెచ్చరించారు. గతంలో సంగారెడ్డి కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తు చేశారు. మిగిలిన కలెక్టర్లైనా జాగ్రత్త వహించాలని విన్నవించారు. ఈ మూడు జిల్లాలలో జరిగిన భూ అన్యాక్రాంతం పై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన కలెక్టర్లు కటకటాల పాలవుతారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్ర
పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. యాత్రకు ఉన్న పోలీసు బందోబస్తు తొలగించి సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ పోలీసు భద్రతను నమ్ముకొని తాను యాత్ర చేపట్టడం లేదని నా కాంగ్రెస్ కార్యకర్తలు సరిహద్దుల్లో సైనికుల కంటే ఎక్కువ అంటూ అభివర్ణించారు. చంద్రశేఖర రావు చెంచాలతో పాదయాత్రకు ఒరిగేదేమీ లేదన్నారు.
రెడ్యా నయా జమిందార్
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నయా జమీందారుగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తండ్రి బిడ్డ కొడుకు ముగ్గురు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆకేరు మానేరు పాలేరులలో ఇసుక పేరు మీద దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజ్ఞా కుటుంబాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జి సెంటర్‌గా మారుస్తామని ప్రకటించారు. పేదల చెమట వాసన కంటే కాంట్రాక్టర్ల సెంటు వాసనే చంద్రశేఖర్ రావుకు ఇష్టంగా ఉందని అందుకే ఎర్రతివాచి పరిచి ప్రగతిభవన్‌లోకి ఆహ్వానిస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తెజావత్ బెల్లయ్య నాయక్, రామచంద్రునాయక్, నెహ్రూ నాయక్, సురేష్ షేట్కర్, బలరాం నాయక్, మల్లు రవి, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్నర్ మీటింగ్‌కు స్థానికులు హాజరయ్యారు.