Site icon vidhaatha

Congress | కాంగ్రెస్‌లో.. రేవంత్ వ్యాఖ్యల కలకలం! సీతక్క సీఎం.. అంటూ భట్టి ఆశలకు చెక్‌

Congress

విధాత : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా తానా స‌భ‌లో చేసిన కాంగ్రెస్ తెలంగాణ సీఎం మాట‌లు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, సీతక్కతో కలిసి తానా సభకు హాజరయ్యారు. దళితులు, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమివ్వాలంటూ ఎన్నారైలు సూచించగా, కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలకు ఇప్పటికే రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల నుండి అన్ని స్థాయిలలో పదవులను ఇచ్చింద‌న్న రేవంత్‌… అవసరమైతే సీతక్కను కూడా రేపు సీఎంను చేయొచ్చు అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే ద‌ళితుడే తొలి ముఖ్య‌మంత్రి అంటూ ఉద్య‌మ‌స‌మ‌యంలో చెప్పిన కేసీఆర్‌…తరువాత దాన్ని మ‌ర్చిపోయార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తుంటారు. అలా కాంగ్రెస్ పార్టీ కిందివ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెబుతుంటారు. ఆ కేట‌గిరిలో ఇప్ప‌టికే పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, సీఎల్ పి నేత భ‌ట్టీ విక్ర‌మార్క ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటున్నారు.

ఇటీవలే భ‌ట్టీ విక్ర‌మార్క పీపుల్స్‌మార్చ్ ముగింపు యాత్ర‌లో రాహుల్ గాంధీ కూడా పొగిడారు. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి తన వర్గంగా ముద్రపడిన సీతక్క కూడా సీఎం కావచ్చంటు చేసిన వ్యాఖ్యలు భట్టితో పాటు ఆయన మద్ధతుదారులకు మింగుడుప‌డ‌లేద‌ని తెలుస్తోంది. రేవంత్ వ‌ర్గీయులు మాత్రం…దీన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. స‌ర‌దాగా అన్న మాటే త‌ప్ప‌… ఎవ‌రు సీఎం అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతున్నారు.

Exit mobile version