Site icon vidhaatha

Politics | పార్టీల ప్రతికార రాజకీయం! ఇందిరతో మొదలు.. మోడీతో వ్యాప్తి

Politics |

విధాత: దేశంలో రాజ్యంగ సంస్థలను, దర్యాప్తు సంస్ధలను అధికార పార్టీలు దుర్వినియోగం చేయడం రివాజుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రాబాబునాయుడు అరెస్టు..రిమాండ్ వివాదంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరోసారి అధికార పార్టీలు దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా మలుచుకుని తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు పాల్పతున్న వ్యవహారాలపై చర్చను రేకెత్తించాయి.

గతంలో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగంతో, గవర్నర్ విచక్షణాధికారాల పేరుతో ప్రభుత్వాలను కూలదోయడం, నిలబెట్టడం, అనుకూల పార్టీలకు బలనిరూపణలో ముందస్తు అవకాశం కల్పించడం వంటి అసంబద్ధ రాజకీయాలకు అధికార పార్టీలు పాల్పడిన చిత్రాలు దేశం ఎన్నో చూసింది. అనంతరం వాటి స్థానంలో ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను తమ ఆధిపత్య, ప్రతికార రాజకీయాలకు దుర్వినియోగం చేయడం విచ్చలవిడిగా మారింది.

టిట్ ఫర్ టాట్ అన్న రీతిలో నిన్నప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రాగానే తమను వేధించిన ప్రభుత్వాల పట్ల, నాయకుల పట్ల అదే ధోరణితో ప్రతీకారం తీర్చుకుంటున్న ఘటనలు దేశ రాజకీయాల్లో పెరిగిపోతున్నాయి. ఇందుకు ఆధ్యం వేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ కాలంలో తన రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష సీఎంలను, మంత్రులను జైళ్లో పెట్టించడంతో ఆరంభించిన రాజకీయ క్రీడ నరేంద్ర మోడీ హాయంలో మరింత విస్తృతంగా అమలవుతుంది.

ఇందుకు ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం ఉసిగోల్పుతుండగా, రాష్ట్రాలలో ప్రభుత్వాలు సీబీసీఐడీ, పోలీస్, విజిలెన్స్ వంటి దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం వంటి ప్రతికార రాజకీయాలు వికృత క్రీడను సాగిస్తున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా మిలటరీ ప్రభుత్వాలు, అధ్యక్ష తరహా ప్రభుత్వాల పరిధిలోని దేశాల్లో ప్రతికార రాజకీయాలు సహజమైపోయాయి.

ఇందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టు ఘటన కూడా తాజా ఉదాహారణగా నిలుస్తుంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ లో ప్రతికార రాజకీయాల పరాకాష్టను ఎంత చెప్పినా తక్కువే. ఈ కోవలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తనను ధిక్కరించాడన్న కోపంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో సాగించిన వేట ఆయనను 16నెలల జైలు జీవితం గడిపేలా చేసింది.

ఇప్పుడు జగన్ కూడా తన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై సైతం అదే తరహా దర్యాప్తు సంస్థల అస్త్రాన్నే ప్రయోగించి ఆయనకు కోర్టు కేసులు, జైలు రిమాండ్‌ల బాధలను రుచి చూపించగలిగారు. తమ ఆధిపత్య పోరులో పార్టీలు నీవంటే నీవే అవినీతి పరుడంటూ పరస్పర ఆరోపణలు, కేసులతో పరస్పర దాడులు చేసుకుంటున్న తీరు ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలను, నేతలను పలుచన చేస్తుందన్నది మాత్రం నిర్వివాదంశమే.

దుర్వినియోగ క్రీడలో కేంద్రందే పైచేయి

రాజ్యంగ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కేంద్ర ప్రభుత్వాలదే ఎప్పుడు పైచేయి ఉంటూ వస్తుంది. అధికార పార్టీలు తమ మిత్ర రాజకీయ పార్టీల పట్ల ఒకలా, ప్రత్యర్థి పార్టీల పట్ల మరొకలా తమ పరిధిలోని రాజ్యంగ, దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నాయి. ఇందిరాగాంధీ హాయం మొదలుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరకు అదే నిర్వాకం కొనసాగుతుంది. ఎమర్జన్సీ సమయంలో అప్పటి యూపీ మాజీ సీఎం చరణ్ సింగ్ ను ఇందిరాగాంధీ జైళ్లో పెట్టించింది.

అనంతర కాలంలో అయోధ్య స్థల వివాదంలో రేగిన అల్లర్లలో ప్రతిపక్ష బీజేపీ అగ్రనేతలపై కేసులు, అరెస్టుల పర్వం సాగింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం హాయంలో గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి హోంశాఖ మంత్రి అమిత్ షాను అరెస్టు చేసి జైలు పాలుచేశారు. కౌంటర్ గా అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యాక చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంను అరెస్టు చేసి జైళ్లో వేయించారు.

ఈ తరహా రాజకీయాలకు ప్రాంతీయ పార్టీల ప్రభావిత రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడులో తనను అసెంబ్లీలో చీరలాగి అవమానించిన ఘటనకు ప్రతిగా తాను సీఎం అయ్యాక మాజీ సీఎం కరుణానిధిని దర్యాప్తు సంస్థల అండతో అరెస్టు చేయించి ఈడ్చుకుంటు తీసుకెళ్లి జైళ్లో పడేసింది. ఈ తరహా ప్రతికార రాజకీయాలతో చేసే కేసులు, అరెస్టులతో రాజకీయ ఆధిపత్య సాధన, ప్రత్యర్ధికి కూడా తమకు ఎదురైన చేదు అనుభవాల రుచి చూపించామన్న మానసిక ఆనందం మినహా ఆ కేసులు రుజువై శిక్షలు పడటం నామమాత్రంగానే కనిపిస్తుంది.

అధిక శాతం తాత్కాలిక రిమాండ్ లు, కోర్టు కేసులు, కొన్ని రోజులు లేక నెలల జైలు మినహా బెయిల్ తో మళ్లీ యధావిధి రాజకీయాల క్రీడనే కొనసాగుతుంది. ఈ మాత్రం దానికి రాజ్యంగ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రజాధనం, పాలనాకాలం వృధా చేయడమేనన్న విమర్శలకు ఆస్కారమిస్తుంది. అయితే అధికారంలో ఉన్నన్నినాళ్లు కొందరు సీఎంలు, మంత్రులు తమ వ్యవస్థలను, సంస్థలకు గంతలు కట్టి కేసుల నుండి తప్పించుకుంటున్నప్పటికి అధికారం పోయాక వారికి సైతం మళ్లీ అరెస్టులు, కేసులు తప్పడం లేదనడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారమే ఉదంతంగా నిలుస్తుంది.

జైలు పక్షులు నామమాత్రమే

కేసులు, జైళ్ల పాలయిన రాజకీయ పార్టీల నేతలలో శిక్షలు పడిన వారు ఇప్పటిదాకా నామమాత్రంగానే ఉన్నారు. మంత్రులు, సీఎం, మాజీ సీఎంలు, ఎంపీలపై పెట్టిన మెజార్టీ కేసులలో కోర్టులలో నిర్ధోషులుగానే బయపడుతున్నారు. మరికొందరికి శిక్షలు ఖరారైన మళ్లీ బెయిల్ పొందడం, పై కోర్టులకు వెళ్లడం వంటి చర్యలను ఆశ్రయిస్తు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీబీఐ మోపిన ఆర్ధిక నేరాల కేసులలో 16నెలలు జైలు జీవితం గడిపారు.

బీహార్ కు రెండుసార్లు సీఎం గా పనిచేసిన లాలూప్రసాద్ యాదవ్ కూడా దాణా కుంభకోణంలో అరెస్టవ్వగా, ఆయనకు ఈ కేసులో సీబీఐ ప్రత్యేక స్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, మూడేళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. మైనింగ్ కుంభ కోణంలో జర్ఞండ్ సీఎం మధుకోడా అరెస్టయ్యారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన షిబు సోరేన్ తన వ్యక్తిగత కార్యదర్శి హత్య కేసులో అరెస్టయినా నిర్ధోషిగా ప్రకటించారు.

హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతలా పాఠశాల ఉపాధ్యాయుల స్కామ్‌లో అరెస్టయి జైలుకెళ్లారు.. తమిళనాడుకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం కరుణానిధిని ఫై ఓవర్ నిర్మాణ అవినీతి కేసులో అరెస్టయ్యారు. కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. తమిళనాడు సీఎంగా ఉండగానే జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూర్ కోర్టు ఆమెకు 4ఏళ్ల శిక్ష , 100కోట్ల జరిమానా విధించింది. కరుణానిధి కుమార్తె కనిమొళి, కేంద్ర మంత్రి రాజాలు 2జీ స్రెక్టమ్ కేసులో అరెస్టయి జైలుపాలయ్యారు.

చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి సైతం అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యురప్ప మైనింగ్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై చేసిన విమర్శల పరువు నష్టం కేసులో అరెస్టయి జైలుపాలయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జైలు పాలయ్యారు.

Exit mobile version