BRS |
గడ్డం అరవింద్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమ్మేళనం
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల BRSలో టికెట్ల కేటాయింపు రచ్చకెక్కింది. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేకు విరుద్ధంగా సీటు కేటాయించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యనాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని నాటి తెలంగాణ ఉద్యమకారులందరూ హాజరయ్యారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరవింద్ రెడ్డి సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేశాడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తానని పట్టించుకోలేదన్నారు. అరవింద్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిల్చుంటే ఉద్యమకారులే గెలిపిస్తామన్నారు.
మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి రాకుండా కొందరు తన అభిమానులకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. దివాకర్ రావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పదేళ్ల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ స్వచ్ఛనీటిని కూడా ప్రజలకు అందించలేకపోయారని అన్నారు.
ప్రతి వర్షాకాలం మంచిర్యాల పట్టణం ముంపు గురవుతున్నప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని పేర్కొన్నారు. దివాకర్ రావుకు కేటాయించిన టికెట్ పై బీఆరెస్ పునరాలోచన చేయాలన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గానికి టికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు. లేని పక్షంలో బీసీలలో ఒకరిని ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలిపించి తమ సత్తా చాటుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నస్పూర్ మాజీ సర్పంచ్ రాజేష్, పలువురు కౌన్సిలర్లు, నాటి తెలంగాణ ఉద్యమకారులు అరవింద రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.