- 2 లక్షలు డిమాండ్ చేసిన ఆర్ ఐ.. లక్షకు ఒప్పందం..
- ఏసీబీని ఆశ్రయించిన రైతు
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్ఏలపై కేసు నమోదు
విధాత, మెదక్ బ్యూరో: పాత పాస్బుక్ నుంచి 22గుంటల భూమిని కొత్త పాస్‌బుక్‌లోకి నమోదు చేసేందుకు సదరు అధికారి రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడంతో ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం సంగాయిపల్లి గ్రామానికి చెందిన రైతు పాపన్నపేట శ్రీనివాస్‌కు సర్వే నంబర్ 1313లో 22 గుంటల భూమి ఉన్నది. ఆ భూమి పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్ పుస్తకంలో నమోదు కాలేదు. నమోదు చేయాలని రైతు శ్రీనివాస్ అధికారుల వద్దకు చెప్పులరిగేలా తిరిగినా పని పూర్తి కాలేదు. చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలని చిన్న శంకరంపేట్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నెల్లి శ్రీహరి డిమాండ్ చేయగా.. అంత ఇచ్చుకోలేనని రైతు శ్రీనివాస్ రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఈ విషయమై రైతు ఏసీబీని అశ్రయించాడు.
పక్కా ప్రణాళిక ప్రకారం వీఆర్ ఏ సురేష్ బాబు సహాయంతో ఆ డబ్బును రైతు వద్ద నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
రైతును ఇబ్బంది పెట్టడంతో తమను ఆశ్రయించినట్టు తెలిపారు. లంచం తీసుకుంటూ దొరికిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, వీఆర్ఏ సురేష్ బాబులపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.