Rishabh Pant | భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. వీపు భాగం మొత్తం కమిలిపోయింది. పంత్ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా, కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో బీఎండబ్ల్యూ కారును స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది. డివైడర్‌ను ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు పంత్ డేరింగ్ స్టంట్ చేశాడు. కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేశాడు.
ఈ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందించారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని తెలిపారు. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాత్రి ప్రయాణం వల్ల .. ఓ దశలో కాస్త నిద్ర మత్తు వచ్చి ప్రమాదం జరిగి ఉండొచ్చని డీజీపీ తెలిపారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్‌లో 46, 93 పరుగులు చేశాడు. ఇటీవల క్రిస్మస్ వేడుకల్ని పంత్ దుబాయ్‌లో జరుపుకున్నాడు. కెప్టెన్ ధోనీ, అతని ఫ్యామిలీతో పాటు పంత్ ఆ సెలబ్రేషన్‌లో ఉన్నారు. ధోనీ భార్య సాక్షి ఆ ఫోటోలను షేర్ చేసింది.