నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు(28) అనే యువకుడు ఆదివారం రాత్రి బైక్‌పై మిర్యాలగూడ నుంచి పెద్దవూర బయల్దేరాడు. నిడమనూరు పరిధిలోని వేంపాడు వద్ద సైదులు(55) అనే పాదచారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కేశవులు, సైదులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు సోమవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో ఘటనాస్థలానికి బయల్దేరారు.
కేశవులు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రమాదస్థలికి అర కిలోమీటర్ దూరంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్‌లో వెళ్తున్న రమావత్ గన్యా(40), నాగరాజు(28), పాండ్య(40), బుజ్జి(38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హాలీయా సీఐ గాంధీ నాయక్, నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి
నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి జాతీయ రహదారి 186 పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటన పై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు తగిన చికిత్సలు అందించాలని ఆయన కోరారు