Site icon vidhaatha

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల కు RRR షాక్

విధాత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఆర్ఆర్ఆర్ నిర్వాసితుల నుండి ఎదురైన తీవ్ర నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. రాయగిరి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే పైళ్లను రాయగిరి గ్రామం ఆర్ఆర్ఆర్ నిర్వాసితులు అడ్డుకుని రోడ్డు అలైన్ మెంట్ మార్పు తో తమకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. మీ భూముల రక్షణ కోసం అలైన్మెంట్ మార్చి మాకు అన్యాయం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యే తో వాగ్వాదానికి దిగారు.

ఎమ్మెల్యే అనుచరులు సర్ది చెప్పబోగా గ్రామస్తులు ఆగ్రహించారు. ఇరువర్గాల మధ్య తోపులాట సాగగా ఎమ్మెల్యేను ముందు కదలనివ్వలేదు. పోలీసులు జోక్యం చేసుకోవడం తో వారికి, గ్రామస్తులకు తోపులాట మరింత ముదిరి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహంతో గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. నిర్వాసితుల రగడతో ఎమ్మెల్యే కళ్యాణానికి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది.

నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి పనితీరు పట్ల పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ, నియోజకవర్గంలోని మండలాల గుండా నిర్మించనున్న ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం తో ఇండ్లు, భూములు కోల్పోతున్న వారు తమ సమస్యల పరిష్కారం పట్ల ఎమ్మెల్యే చరవ చూపడం లేదంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం అలైన్మెంట్ వివాదం ఎమ్మెల్యే మెడకు చుట్టుకుని ప్రజల్లో వ్యతిరేకత తెచ్చిపెడుతుండటం పైళ్ల వర్గీయులకు మింగుడు పడనిదిగా మారింది.

మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ సర్వే కోసం వచ్చిన సర్వే రెవిన్యూ అధికారులను మంగళవారం చౌటుప్పల్ మండలం మందోళ్ల గూడెం, నేలపట్ల, కుంట్ల గూడెం గ్రామస్తులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసి వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసనతో వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 గ్రామాల్లో 1854.44 ఎకరాలో భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది భూసేకరణ గ్రామాల మీదుగా, కోట్లా విలువ చేసే రైతుల భూముల నుండి సాగుతుండటంతో రైతులు భగ్గుమంటున్నారు.

Exit mobile version