Site icon vidhaatha

Rs.75 Coin | కొత్త రూ.75 కాయిన్‌ను ఎలా పొందాలి?

Rs.75 Coin |

విధాత: నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌న ప్రారంభ వేడుక‌ను పుర‌స్క‌రించుకుని భార‌త ప్ర‌భుత్వం రూ.75 నాణాన్ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. 34.65 నుంచి 35.35 గ్రాముల బ‌రువుండే ఈ కాయిన్‌పై ఒక వైపు నాలుగు సింహాల చిహ్నం, రూ.75 అని ముద్రించారు.

అలాగే భార‌త్ అని దేవ‌నాగ‌రి లిపిలో, ఇండియా అని ఇంగ్లిషులో రాశారు. మ‌రోవైపు నూతన పార్ల‌మెంటు భ‌వ‌న చిత్రాన్ని ముద్రించారు. కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ ఈ నాణాన్ని త‌యారుచేయ‌గా.. ప్ర‌ధాని మోదీ విడుద‌ల చేశారు.

మార్కెట్‌లో చెల్లుబాటు అవుతుందా..

రూ.75 కాయిన్‌ను భార‌త ప్ర‌భుత్వం క‌మోమ‌రేటివ్ కాయిన్స్ జాబితాలోకి చేర్చింది. ఎవ‌రైనా ప్ర‌ముఖుల మీద కానీ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల మీద కానీ, చారిత్ర‌క ఘట్టాల‌పై కానీ అరుదుగా ముద్రించే నాణాల‌ను ఈ జాబితాలో చేరుస్తారు.

అయితే వీటిని సాధార‌ణ న‌గ‌దులా మార్కెట్‌లో వినియోగించ‌డానికి వీలుండ‌దు. గుర్తుగా ఉంచుకోవ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. భార‌త ప్ర‌భుత్వం 1964 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి 150 కాయిన్స్‌ను ముద్రించింది.

ఎలా కొనుక్కోవాలి

http://www.indiagovtmint.in వెబ్‌సైటుకు వెళ్లి అందులో క‌మోమ‌రేటివ్‌ కాయిన్స్ సెక్ష‌న్‌కు వెళ్లాలి. అనంత‌రం ఆన్‌లైన్ షాపింగ్ చేసిన‌ట్లే డ‌బ్బులు చెల్లించి వాటిని బుక్ చేసుకోవాలి. ఒకే సారి 10 కొంటే మాత్రం పాన్ వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది. తాజా రూ.75 కాయిన్ ధ‌ర‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. దీని త‌యారీకే రూ.1300 ఖ‌ర్చ‌యిన‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి ఆపైనే దాని వెల ఉండే అవ‌కాశ‌ముంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన కాయిన్‌లు ఇవే

రూ.100 నాణెం: ప్ర‌ధాని మోదీ మాన‌స పుత్రిక మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం 100వ ఎపిసోడ్ సంద‌ర్భంగా రూ.100 కాయిన్‌ను విడుద‌ల చేశారు.

రూ100 వెండి నాణెం: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు 100వ జ‌యంతి సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం రూ.100 వెండి నాణాన్ని ముద్రించింది.

రూ.175 నాణెం: ఐఐటీ రూర్కీ శంకుస్థాప‌న జ‌రిగి 175 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా రూ.175 నాణాన్ని తీసుకొచ్చారు.

రూ.100 నాణెం: 2018లో భార‌త మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ 94వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న ముఖ‌చిత్రంతో రూ.100 నాణాన్ని ముద్రించారు.

Exit mobile version