బీఆరెస్‌తో బీఎస్పీ పొత్తు.. కేసీఆర్‌తో ఆరెస్పీ భేటీలో నిర్ణయం

బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆరెస్ ప్రవీణ్‌కుమార్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది

  • Publish Date - March 5, 2024 / 09:05 AM IST

  • రాష్ట్రాన్ని కాపాడేందుకేనన్న ఆరెస్పీ
  • బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ
  • నాగర్ కర్నూల్‌ ఎంపీగా పోటీ


విధాత, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన బీఎస్పీ.. అదే బీఆరెస్‌తో రానున్న లోక్‌సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఎస్పీ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం నందినగర్‌లోని ఆయన నివాసంలో తన పార్టీ ప్రతినిధి బృందంతో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.


రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఉభయ పార్టీలు నిర్ణయించాయి. పొత్తుకు సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారుకానున్నాయని ఉభయ పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆరెస్ మద్దతుతో ఎంపీగా పోటీచేయనున్నారు. ఇందుకు కేసీఆర్ కూడా తన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.


బీఎస్పీతో పొత్తు కుదిరింది : కేసీఆర్‌


ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తో భేటీ అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు కుదిరింద‌ని చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడి, బీఆరెస్‌తో పొత్తుపై అనుమతి తీసుకున్నారని వెల్లడించారు. ఆ త‌ర్వాత బీఆరెస్‌, బీఎస్పీ క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించామని కేసీఆర్ తెలిపారు. సీట్ల స‌ర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగ‌తా విష‌యాల‌న్నీ రానున్న రెండు రోజుల్లో ప్ర‌క‌టిస్తామన్నారు. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుంటాయని తెలిపారు. బుధవారం తాను మాయావతితో మాట్లాడుతానని చెప్పారు.


నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి ప్ర‌వీణ్ కుమార్ పోటీ చేస్తారా? అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా.. ‘పెద్దప‌ల్లి నుంచి పోటీ చేయొద్దా? రాష్ట్ర అధ్య‌క్షుడు క‌దా! వ‌రంగ‌ల్ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జ‌న‌ర‌ల్ సీట్ల‌లో కూడా పోటీ చేయొచ్చు అని’ అని కేసీఆర్ బదులిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆరెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణ‌కు ముప్పు ఉంద‌ని, అందుకే బీఆరెస్‌తో క‌లిసి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నామ‌ని తెలిపారు. కేసీఆర్‌ను క‌లిసినందుకు ఆనందంగా ఉందన్నారు.


దేశంలో సెక్యుల‌రిజం ప్ర‌మాదంలో ఉన్న‌దని, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర‌లు చేస్తుందని ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసేందుకు కూడా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. లౌకికతత్వాన్ని నిరంత‌రం కాపాడిన నేత అంటూ కేసీఆర్‌ను ప్రశంసించారు. ఆయనతో క‌లిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. మాయావ‌తి ఆశీస్సుల‌తో ముందుకు వెళ్తామని, త్వరలోనే సీట్ల స‌ర్దుబాటు చేసుకుని త‌ర్వాత కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామని తెలిపారు.


మాయావ‌తితో కేసీఆర్‌ త‌ప్ప‌కుండా మాట్లాడుతారని చెప్పారు. తమ పార్టీల స్నేహం తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను మారుస్తుందన్నారు. బ‌హుజ‌న వ‌ర్గాల జీవితాలు త‌ప్ప‌కుండా బాగుప‌డుతాయని, తెలంగాణ ప్ర‌జ‌లు తమ పొత్తును ఆశీర్వ‌దిస్తార‌ని మాకు న‌మ్మ‌కం ఉందని ప్రవీణ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు నెల‌లు అవుతోందని, ఈ ప్ర‌భుత్వం ప‌ట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరని ఆరెస్పీ చెప్పారు. నిరుద్యోగులు రోడ్ల‌ మీద‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఉందని అన్నారు.

Latest News