విధాత : బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చలు జరిగినప్పుడు విమర్శలు వచ్చాయి. పొత్తు ఖరారైన తర్వాత కూడా అవి కొనసాగాయి. అయితే ఇవేవీ పట్టించుకోబోమని, బహుజనవాదాన్ని తాను వీడేదని మాట్లాడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలేంటన్న అంశంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పొత్తులో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్నదే ఈ ఎన్నికల్లకు ప్రామాణికం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ మరింత బలహీనపడింది.
సిటింగ్ ఎంపీలు ఆ పార్టీని వీడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అవుతున్నారు. దీంతో వాళ్లు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఓట్ల బదిలీ కూడా జరగకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తాను లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోతే తనకు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆరెస్పీకి అర్థమైందని, అందుకే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది.
బీఎస్పీకి రాజీనామా చేసిన విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తును బీజేపీ భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని (ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో సహా) కూడా అందులో ప్రస్తావించారు. అనంతర ఆయన బీఆర్‌ఎస్‌పీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని స్పష్టమైంది. అయితే కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణమాలు, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రెండు పార్టీలు కాంగ్రెస్‌ను సీన్‌లోంచి లేకుండా చేయడమే కోసమే పరోక్షంగా కలిసి పనిచేస్తున్నట్టు అర్థమవుతున్నది.
కవిత అరెస్ట్‌పై ఇవాళ రాష్ట్రవాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. కవిత అరెస్ట్‌పై స్పందించిన ఆర్‌ఎస్‌పీపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే పొత్తులో వల్ల గతంలో బీఆర్ఎస్ పాలనపై ఆయన చేసిన ట్వీట్లను, ఇప్పటి మాటలను కలిపి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అందుకే బీఎస్పీలో కొనసాగుతూ.. ఆ పార్టీ బాధ్యతలు మోస్తూ ఎన్నికలను ఎదుర్కోవడం కంటే బీఆర్‌ఎస్‌లో చేరితేనే మంచిదనే అభిప్రాయానికి ఆర్‌ఎస్‌పీ వచ్చి ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాబట్టే కేంద్రమే కవితను కాపాడుతున్నదని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. శుక్ర, శనివారాల్లో ప్రధాని తెలంగాణ పర్యటన, శనివారం షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు వెళ్లిన దాదాపు అందరినీ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే కవిత అరెస్ట్‌పై విపక్ష, అధికారపక్షాలపై మాటల యుద్ధం జరిగింది. ఆమె అరెస్టు ఖాయమని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ ఆమెను అప్పుడు అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల్లో ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లే కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌తో పెట్టుకుని తప్పుచేస్తున్నారని ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయడమే ఈ రెండు పార్టీల లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరి అవగాహన మేరకే ఇదంతా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీల అవగాహనమే మేరకే కొన్నిరోజులుగా రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయిని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.