Sanitary Napkins |
విధాత: దేశవ్యాప్తంగా పాఠశాలలకు బాలికల కోసం రుతుక్రమ సమయంలో పరిశుభ్రత నిర్వహణకు జాతీయ విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇది చాలా ప్రాధాన్యం ఉన్న అంశంగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ మేరకు శాసనకర్తలు, అధికారులను భాగస్వాములను చేయాలని, దాని అమలుకు జాతీయ విధానాన్ని తీసుకురావాలని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా ధర్మాసనం కేంద్రానికి సూచించింది.
ఎయిడెడ్, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో 6-12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు, ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో చదువుతున్న బాలికల రుతుస్రావం పరిశుభ్రత అంశంపై పిటిషనర్ ముఖ్యమైన సమస్యను లేవనెత్తారని, ఇందుకు ఏకరీతి జాతీయ విధానాన్ని తీసుకురావాలని ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌ను సైతం పరిగణలోకి తీసుకుంది.
ఈ విషయంలో రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తాయని, నాలుగు వారాల్లో తమ విధానాన్ని కేంద్రానికి పంపాలని రాష్ట్రాలకు సూచించింది. జాతీయ పాలసీ తయారీ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించింది.