Supreme Court | ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను త్వరలోనే ఆమోదించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. దీంతో ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతికి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది డిసెంబర్ 13న కేంద్రానికి సిఫారసు చేసింది. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన జస్టిస్ న్యాయమూర్తి సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనో మిశ్రా పేర్లున్నాయి.
32కు చేరననున్న న్యాయమూర్తుల సంఖ్య
ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపితే.. సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరనున్నది. ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అయితే, జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం మరో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను ఆమోదం కోసం పంపింది. ఇందులో అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్‌కుమార్ పేర్లున్నాయి. అయితే, తాజాగా పంపిన సిఫారసులను గతంలో పంపిన వాటితో కలపవద్దని కొలీజియం ప్రభుత్వానికి సూచించింది.
సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన కేంద్రం..
ఇదిలా ఉండగా.. కొలీజియం పంపిన ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన పేర్లను త్వరలోనే ఆమోదించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆయా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ వారెంట్‌ను త్వరలోనే జారీ చేయనున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్యలు తీసుకునేలా బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. కొలీజియం సిఫారసులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని, దీంతో ఓ న్యాయమూర్తి పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేయాలని చూస్తున్నారా? అంటూ కేంద్రం తీరుపై మండిపడింది.