Site icon vidhaatha

Vande Bharat Express | త్వరలో కూతపెట్టనున్న సికింద్రాబాద్‌ – తిరుపతి వందేభారత్‌ రైలు..!

Vande Bharat Express | త్వరలో సికింద్రాబాద్‌ (secunderabad) – తిరుపతి (tirupati) మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) పరుగులుపెట్టనున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం – సిక్రిందాబాద్‌ (visakhapatnam – secunderabad) మధ్య నడుస్తున్న విషయం తెలిసింది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రైలు ప్రయాణ మార్గాలపై కసరత్తు చేస్తున్నది. బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ మీదుగా నడపాలని, లేదంటే వరంగల్‌, ఖాజీపేట, కడప.. మరోకటి బీబీనగర్‌ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా నడిపేందుకు సర్వే చేపట్టారు.

వీటితో పాటు పిడుగురాళ్ల జంక్షన్‌ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా సర్వే నిర్వహించారు. ఇందులో తక్కువ దూరం ఉన్న మార్గాన్ని పరిశీలించనున్నారు.

వందేభారత్‌ 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లనుండగా ట్రాక్‌ల పటిష్టత, వంతెన నిర్మాణాలను తనిఖీ చేసిన తర్వాత అధికారికంగా రైలు నడిచే రూట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది. వందే భారత్‌ రైలు టికెట్‌ ధర జీఎస్టీ, తత్కాల్‌ సర్‌చార్జితో కలిపి రూ.1150 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే రైళ్లలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సమయం 12 గంటల సమయం పడుతున్నది. వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తే ఆరేడు గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చని అంచనా. రైలు ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version