Site icon vidhaatha

ఓటమి భయంలో కేటీఆర్‌.. అందుకే మతిస్థిమితం లేని వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : మాజీ మంత్రిగా కేటీఆర్‌ తనకు తాను ఒక పెద్ద నాయకుడిగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గజ్జెల కాంతం విమర్శించారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా కేటీఆర్‌ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీతో ఇంతకాలం కుమ్మక్కయింది బీఆరెస్‌ కాదా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన అన్ని చట్టాలకు మద్దతు ఇచ్చిన బీఆరెస్‌ నాయకులకు తమను ఇప్పుడు విమర్శించే హక్కు లేదన్నారు.


బీఆరెస్‌ నాయకులు వారు చేసిన కుంభకోణాల నుంచి కాపాడుకోవడానికే మోదీతో కుమ్మక్కయ్యారని గజ్జెల కాంతం ఆరోపించారు. మోదీ కాళ్లు మొక్కి, మీ పదవులు, మీ ఆస్తులు కాపాడుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసే హక్కు కేటీఆర్‌కు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారని చెప్పారు. ప్రధాన మంత్రిని ఒక ముఖ్యమంత్రి పెద్దన్న అంటే తప్పేమీ లేదన్నారు.


తెలంగాణ ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టే రేవంత్ రెడ్డి ప్రధానికి వినతిపత్రాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకానీ.. మీలాగా చీకటి ఒప్పందాలు, రాత్రి పూట కలవడాలు కాంగ్రెస్‌కు లేవని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. మోదీ విషయంలో బీఆరెస్‌ నాయకులవి స్వార్థ ప్రయోజనాలైతే.. తమవి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలని తేల్చి చెప్పారు. కేటీఆర్‌ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయం పట్టుకుంది కాబ్టటే బీఎస్పీతో కూడా పొత్తుకు సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు.

Exit mobile version