- తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
విధాత: స్వర్గీయ ఎన్టీఆర్ రెండో సతీమణిగా లక్ష్మీపార్వతి గురించి అందరికీ తెలుసు. ఈమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ వంటి వారు సినిమాలు కూడా తీశారు. ఎన్టీఆర్‌ని లొంగదీసుకోవడం నుండి.. ఆయన షాడోగా ఉంటూ రాజకీయాలను శాసించాలని ఈమె పలు ప్రయత్నాలు చేసిందని అంటారు. ఎన్టీఆర్ తర్వాత తానే సీఎం కావాలని ఆశపడిందని అంటారు. కానీ చంద్రబాబు చాణక్యంతో ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించిన సంగతి తెలిసిందే.
నందమూరి ఫ్యామిలీని ఒకే మాట మీదకు తీసుకొని వచ్చి.. ఆ ఇంటికి పట్టిన లక్ష్మీపార్వతి అనే శనిని బయటికి పంపించేశాడు అని ఆమె విరోధులు వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా లక్ష్మీ పార్వతి.. తారకరత్న మరణాన్ని కూడా రాజకీయం చేసేలా మాట్లాడింది. ఆమె మాటలు విన్నవారంతా మరీ ఇంత దిగజారుడు మాటలు అవసరమా? అంటూ ఫైర్ అవుతున్నారు. నిజంగా తారకరత్న మరణంపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
శివరాత్రి రోజున శివైక్యం చెందిన నందమూరి తారకరత్న మరణంపై ఈ వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. తారకరత్న 23 రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడని, అప్పటి నుంచి ఈ వార్త బయటకు రాకుండా చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించారని ఆరోపించింది. తన కొడుకు నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు చంద్రబాబు ఇంత నీచానికి దిగజారాడని.. ఇది అతని దుర్మార్గానికి పరాకాష్టగా ఆమె అభివర్ణించింది.
తన రాజకీయ స్వార్థం కోసం నందమూరి కుటుంబంలో మరొకరిని వాడుకున్నారని తెలుపుతూ.. తారకరత్న మరణించాడని తొలి రోజుల్లోనే డాక్టర్లు ధృవీకరించారని, గుండె ఆగిపోయిన విషయాన్ని చెప్పేశారని పేర్కొంది. కానీ అలా ప్రకటిస్తే రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్‌లు అపశకునాలనే భావన ప్రజల్లో వస్తుందనే కారణంతో వార్తలు బయటకు రానివ్వలేదని వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడే లక్ష్మీ పార్వతి అవివేకం బయటపడింది. అదెలా అంటే..
తారకరత్న భార్య సాక్షాత్తూ వైసీపీ దిగ్గజం విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు. ఆయనకి కూతురు వరస అవుతుంది. తారకరత్న హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులూ విజయ సాయి రెడ్డి తిరుగుతూనే ఉన్నారు. మరి విజయ సాయి రెడ్డికి చనిపోయిన వ్యక్తి.. బతికి ఉన్నాడని చెప్పడం వీలు కాదు కదా! అనే ప్రశ్నకు లక్ష్మీపార్వతి వద్ద సమాధానం ఉందా? అంటూ టీడీపీ వారే కాకుండా.. వైసీపీ వారు కూడా లక్ష్మీ పార్వతికి ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇంకా తారకరత్న మరణం గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయానికి తన భర్త రామారావు కూడా అలాగే చనిపోయారని తెలిపింది. పాపం రాజకీయంగా నారా కుటుంబానికి సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో, ఎంతో అభిమానంతో ముందుకు వచ్చిన తారకరత్నపై చంద్రబాబు కనికరం లేకుండా వ్యవహరించారని లక్ష్మీపార్వతి మండిపడింది.