ఖాట్మాండు : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78) నేపాల్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. 19 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో అతన్ని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం విధితమే. ఈ క్రమంలో జైలు నుంచి విడుదల చేసి.. ఆ తర్వాత ప్రక్రియ కోసం ఇమ్మిగ్రేషన్ అధికారులకు శోభరాజ్‌ను అప్పగించగా.. అతన్ని ఫ్రాన్స్ పంపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
2003లో శోభరాజ్ ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను హత్య చేసిన కేసులో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జీవితఖైదు విధించగా అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతూ వస్తున్నాడు. 20 సంవత్సరాల కారాగారశిక్షను జీవిత ఖైదుగా పరిగణిస్తుండగా.. 75శాతం శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు నేపాల్ చట్టాలు అనుమతిస్తాయి. దీంతో శోభరాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ విచారణ జరిపి, వృద్ధాప్య కారణాల రీత్యా విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.
చార్లెస్ శోభరాజ్ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించగా.. చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత తల్లి రెండోభర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నాడు. కానీ, దత్తత తండ్రి, తల్లికి పిల్లలు పట్టడంతో శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేయడంతో నేర ప్రవృత్తి వైపు వెళ్లాడు.
1970లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలతో శోభరాజ్ పేరు మార్మోగింది. 20 హత్య కేసుల్లో చిక్కుకోగా.. ఢిల్లీలోని ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయ్యాడు. భారత్‌లోని వివిధ జైళ్లలో 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఓసారి భారత్‌లోని ఓ జైల్లో సిబ్బందికి పార్టీ పేరిట డ్రగ్స్ ఇచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతడిని మళ్లీ అరెస్టు చేశారు.
1970ల్లో అతడు 15-20 మందిని హత్య చేసినట్లు అంచనా. ఆసియా పర్యటనకు వచ్చే పాశ్చాత్య దేశాల పౌరులతో స్నేహం చేసేవాడు. ఆ తర్వాత వారికి మత్తుమందు ఇచ్చి చంపేసేవాడు. అయితే, శోభరాజ్ చేతుల్లో హత్యకు గురైనవారిలో ఇద్దరి ఒంటిపై కేవలం బికినీలే కనిపించేవి. అందుకే అతన్ని ‘బికినీ కిల్లర్’ అని కూడా పిలుస్తారు.