Site icon vidhaatha

మ‌త్స్య‌కారుడిపై షార్క్ దాడి.. ఒడ్డుకు చేర్చాక సొర‌చేప మృతి.. వీడియో

ముంబై : స‌ముద్రంలో ఉండే షార్క్(సొర‌చేప‌) ఓ న‌దిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ షార్క్ మ‌త్స్య‌కారుడిపై దాడి చేసింది. ఆ త‌ర్వాత సొర‌చేప‌ను బంధించి ఒడ్డుకు చేర్చాక అది ప్రాణాలు కోల్పోయింది. మ‌త్స్య‌కారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని పాల్ఘ‌ర్ జిల్లాలో ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పాల్ఘ‌ర్ జిల్లాలోని మ‌నోర్ దొంగ‌ర్ గ్రామానికి చెందిన విక్యా సురేశ్ గోవారి(34) చేప‌లు ప‌డుతూ జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నాడు. అయితే త‌మ గ్రామానికి స‌మీపంలో ఉన్న న‌దిలోకి చేప‌లు ప‌ట్టేందుకు మంగ‌ళ‌వారం వెళ్లాడు. అయితే ఆక‌స్మాత్తుగా అత‌నిపై షార్క్ దాడి చేసింది. కాలికి తీవ్ర గాయం కావ‌డంతో అత‌ను ఒడ్డుకు చేరుకున్నాడు. అనంత‌రం మిగ‌తా మ‌త్స్య‌కారులంతా క‌లిసి షార్కును బంధించి, దాన్ని కూడా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే సొర‌చేప చ‌నిపోయింది. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

షార్క్ దాడిలో గాయ‌ప‌డ్డ సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్తా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అనంత‌రం మెరుగైన చికిత్స నిమిత్తం వినోభ భావే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అత‌ని ఎడ‌మ కాలి కింది భాగంలో నాలుగు ఇంచుల లోతులో గాయ‌మైంద‌ని వైద్యులు పేర్కొన్నారు. అయితే గాయం కార‌ణంగా మోకాలి కింది వ‌ర‌కు కాలు తీసివేయాల‌ని వైద్యులు నిర్ధారించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

షార్క్ మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతుంద‌ని పోలీసులు, అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version