Site icon vidhaatha

NALGONDA: శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు

విధాత: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు ఊరు వాడ శివాలయాలన్ని భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. భక్తుల మహాశివరాత్రి పూజలతో శివ నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి.

ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు చెరువు గట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి, యాదగిరిగుట్ట శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి, సూర్యాపేటలోని పిల్లలమర్రి శివాలయం, నల్గొండ పానగల్ లోని చారిత్రక పచ్చల, ఛాయ సోమేశ్వరాలయాలం.

కృష్ణ నది తీరాన ఉన్న శివాలయాలు వాడపల్లి అగస్తేశ్వర స్వామి ఆలయం, మేళ్లచెరువు శంభు లింగేశ్వర ఆలయం, నేరేడుచర్ల బుగ్గ పరమేశ్వరాలయం, అడవిదేవులపల్లి పంచాయతన శివాలయం, నాగార్జున సాగర్ ప్రాచిన ఏలేశ్వర స్వామి ఆలయం శివ భక్తుల సందర్శనతో రుద్రాభిషేకాలు, బిల్వార్చనల పూజలతో రోజంతా రద్దీగా కనిపించాయి.

తెలంగాణ టూరిజం శాఖ నాగార్జునసాగర్ విజయ విహార్ బోట్ పాయింట్ నుండి సాగర్ మధ్యలో ఉన్న ప్రాచీన ఏలేశ్వరం కొండకు ప్రత్యేక లాంచీలు నడపడంతో వేలాదిగా భక్తులు ఏలేశ్వరం స్వామిని సందర్శించుకున్నారు.

ఎలేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల దారులు లేకపోయినప్పటికీ రాళ్లు రప్పలగుండానే వేలాది మంది భక్తులు మహిళలు వృద్ధులు శివయ్య పై భారం వేసి హర నామస్మరణ చేస్తూ కొండ శిఖరానికి చేరుకొని కాత్యాయని ఏలేశ్వరులను దర్శించుకుని తరించారు.

పెద్ద ఎత్తున మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస, జాగరణ దీక్షలు చేపట్టి మహాశివుడి పూజలలో పాల్గొన్నారు . నల్లగొండ బ్రహ్మంగారి గుట్ట కాశీ విశ్వేశ్వర ఆలయం, భువనగిరి పచ్చల కట్ట సోమేశ్వరాలయం మూసి తీరంలోని సంగెం, పొద్దుటూరు, బీబీనగర్ , పోచంపల్లి, వలిగొండ సుంకిశాల, శివాలయాలు భక్తుల మహాశివరాత్రి పూజలు శివపార్వతుల కల్యాణోత్సవాలతో కళకళలాడాయి.

పరమేశ్వరుడికి ప్రముఖుల పూజలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాదేవుడికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం సందర్శించి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పిటిసీ పాశం రాంరెడ్డి తో కలిసి తిప్పర్తి మండలం రామలింగాలగూడెం మహదేవ మార్కండేయ స్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు బిల్వార్చనలు నిర్వహించారు.

పానగల్ పచ్చల ఛాయా సోమేశ్వరాలయంలలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేర్వేరుగా రుద్రాభిషేకాలు నిర్వహించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మేళ్లచెరువు శంభు లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, ఎన్. భాస్కరరావు , శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కోటిరెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లు తమ తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి పూజల్లో పాల్గొన్నారు.

Exit mobile version