న్యూఢిల్లీ: రాజస్థాన్ నుంచి యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ బుధవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె వెంట రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ డోటస్ర, అసెంబ్లీలో విపక్ష నేత టికారాం జులీ తదితరులు హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని విపక్ష లాబీలో సోనియాగాంధీ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, తన అభ్యర్థిత్వానికి మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు.
రాజస్థాన్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడింటిలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు సులభంగా నెగ్గే పరిస్థితిలో ఉంది. గతంలో ఇదే రాజస్థాన్ రాష్ట్రం నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ఆరేళ్ల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుండటంతో సోనియాగాంధీ ఆ స్థానంలో పోటీ చేస్తున్నారు. సోనియాగాంధీ ఇప్పటి వరకూ ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభకు గెలిస్తే ఇదే మొదటిసారి అవుతుంది.
సోనియాతోపాటు..
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సర్క్యూలర్ విడుదల చేశారు. అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ప్రస్తావించారు.