Site icon vidhaatha

కాంగ్రెస్‌ దగ్గర రెండ్రూపాయలు కూడా లేవు


న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా ఆర్థికంగా తమను బలహీనపర్చేందుకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేశారని విమర్శించారు. తమ ఖాతాలను స్తంభింపజేయడంతో ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లే నాయకులు కనీసం రైలు టికెట్‌ కొనుగోలు చేయడానికి కూడా తమ పార్టీ వద్ద డబ్బులు లేకుండా పోయాయని పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ చెప్పారు. భారతదేశ ఓటర్లలో తమకు 20శాతం మంది ఉన్నారని, కానీ.. తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేక పోతున్నామని చెప్పారు.


గురువారం (2024, మార్చి 21) ఆమె అరుదైన మీడియా సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘ఈ రోజు మేం ప్రస్తావిస్తున్న అంశం అత్యంత తీవ్రమైనది. ఈ అంశం ఒక్క కాంగ్రెస్‌ పార్టీనే కాదు.. మొత్తంగా ప్రజాస్వామ్యాన్నే ప్రభావితం చేసేది. భారత జాతీయ కాంగ్రెస్‌ను ఆర్థికంగా బలహీనం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ద్వారా ఒక వ్యవస్థాగత ప్రయత్నం జరుగుతున్నది’ అని సోనియా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఖాతాలను స్తంభింపజేయడాన్ని చేయడాన్ని ప్రస్తావించిన సోనియా.. ఎలక్టోరల్‌ బాండ్ల అంశం నేపథ్యంలో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్థికస్థితిపై దాడి జరుగుతున్నదని అన్నారు.


కేంద్రం చర్యలు అప్రజాస్వామికం


‘ప్రజల నుంచి సేకరించిన నిధులను ఫ్రీజ్‌ చేశారు. మా ఖాతాల్లోని సొమ్మును బలవతంగా గుంజుకున్నారు. అయినా ఇంతటి సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితిలో కూడా మా ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు శక్తిమేరకు కృషి చేస్తున్నాం’ అని సోనియా అన్నారు. ఇటీవల ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను రాజ్యంగ వ్యతిరేకమంటూ రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన సోనియా.. ఈ స్కీమ్‌తో బీజేపీకి భారీగా లబ్ధి చేకూరిందని విమర్శించారు. ‘మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక పరిస్థితిపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతున్నది. ఇది మునుపెన్నడూ లేనిది.. అప్రజాస్వామికమైనది’ అని ఆమె చెప్పారు.


నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి : ఖర్గే


రాబోయే ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ సంస్థలను, కేంద్ర ఏజెన్సీలను నియంత్రించరాదని స్పష్టం చేశారు. యావత్‌ ప్రపంచంలో ప్రజాస్వామిక విలువలకు, పద్ధతులకు భారత్‌ ప్రఖ్యాతిగాంచింది. ఏ ప్రజాస్వామ్యానికైనా నిష్పాక్షిక ఎన్నిక అనేది అత్యవసరం. దానితోపాటే దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. అంతేకానీ.. అధికారంలో ఉన్న పార్టీ మీడియాపైన, ఐటీ, ఈడీ, ఎన్నికల సంఘం ఇతర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను గుప్పిట పట్టరాదు’ అని ఖర్గే చెప్పారు.


గత నెలలో బీజేపీ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేసిందని, తమ చట్టసభ సభ్యుల నుంచి విరాళాలు, రిటర్న్స్‌ దాఖలు చేయడంలో 45 రోజుల జాప్యం జరిగిందని ఆరోపిస్తూ 210 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దాదాపు వంద కోట్ల రూపయాలకు పైగా బకాయి ఉన్న పన్ను చెల్లింపులకు ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన నోటీసులపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ఇన్‌కం ట్యాక్స్‌ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఉత్తర్వులను గత వారం ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.


రైలు టికెట్లకూ డబ్బుల్లేవు: రాహుల్‌


తమ ఖాతాలను స్తంభింపజేయడంతో ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లే నాయకులు కనీసం రైలు టికెట్‌ కొనుగోలు చేయడానికి కూడా తమ పార్టీ వద్ద డబ్బులు లేకుండా పోయాయని పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ చెప్పారు. ‘మా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేశారు. మేం ప్రచారం చేసుకోలేక పోతున్నాం. మా అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేక పోతున్నాం. వారు విమాన ప్రయాణాలు కాదు కదా.. ఆఖరుకు రైలు టికెట్‌ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేకుండా పోయాయి. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు చేస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.


‘ప్రజాస్వామిక చట్రాన్ని రక్షించేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. కానీ.. ఏమీ జరుగడం లేదు. ఎన్నికల సంఘం ఏమీ అనడం లేదు. కోర్టులు ఏమీ చెప్పడం లేదు. ఎన్నికల్లో మా పోరాట శక్తిని నష్టపరుస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రధాని, హోం మంత్రి నేరపూరిత చర్య. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనేది అసత్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనేది అసత్యం. భారతదేశ ఓటర్లలో మాకు 20శాతం మంది ఉన్నారు.


కానీ.. మేం రెండు రూపాయలు కూడా చెల్లించలేక పోతున్నాం. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని బలహీనపర్చేందుకే ఈ పరిస్థితి సృష్టించారు. ఈ రోజు మా ఖాతాలను తిరిగి యథాస్థితికి తెచ్చినా.. మాకు ఇప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. అయినా మీడియా, కోర్టులు.. ఏ ఒక్కరూ ఏమీ అనడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘మీ ప్రజాస్వామ్యాన్ని దోచుకుంటుంటే.. అందరూ మౌనగా ఉంటున్నారు. అందుకే .. ఈ బాధ్యత మీదే’ అని ప్రజలనుద్దేశించి రాహుల్‌ చెప్పారు.

Exit mobile version