చిన్నారి విష‌యంలో విమాన‌యాన సంస్థ పొర‌పాటు.. నెటిజ‌న్ల ఫుల్ ట్రోలింగ్‌

అమెరికాలో చౌక విమాన‌యాన సంస్థ‌గా పేరొందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో వార్త‌ల్లోకి ఎక్కింది.

  • Publish Date - December 25, 2023 / 09:48 AM IST

విధాత‌: అమెరికా (America) లో చౌక విమాన‌యాన సంస్థ‌గా పేరొందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ (Spirit Airlines) విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో వార్త‌ల్లోకి ఎక్కింది. అస‌లేం జ‌రిగిందంటే.. విదేశాల్లో చిన్న పిల్ల‌ల‌ను కూడా త‌ల్లిదండ్రులు లేకుండా విమాన ప్ర‌యాణాలు చేయొచ్చు. దీనికి ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉంటాయి. అలానే గురువారం ఒక చిన్నారిని వారి త‌ల్లిదండ్రులు ఫిల‌డెల్ఫియా ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అప్ప‌గించి విమానం ఎక్కించాల‌ని కోరారు. అత‌డు అక్క‌డి నుంచి ఫోర్ట్ మేయ‌ర్లోని సౌత్ వెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది.


అయితే సిబ్బంది పొర‌పాటు కార‌ణంగా ఆ చిన్నారి ఓర్లాండో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం వెలుగులోకి రావ‌డంతో సోష‌ల్ మీడియాలో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. చాలా మంది ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌సిద్ధ హాలీవుడ్ సినిమా అయిన హోం ఎలోన్‌తో పోలుస్తున్నారు. అందులో కూడా క‌థానాయ‌కుడి పాత్ర.. వేరే విమానం ఎక్క‌డంతో కుటుంబంతో విడిపోతుంది. ఈ బుడ‌త‌డి క‌థ‌తో హోం ఎలోన్ 2 రీమేక్ చేయొచ్చ‌ని ఒక యూజ‌ర్ రాసుకొచ్చారు.


దీనిపై స్పిరిట్ ఎయిర్ లైన్స్ వివ‌ర‌ణ ఇచ్చింది. చిన్నారిని వారి సంబంధిత వ్య‌క్తుల వ‌ద్ద‌కు చేర్చేవ‌ర‌కు త‌మ సంర‌క్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు పేర్కొంది. పొర‌పాటును తెలుసుకోగానే త‌మ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్నార‌ని చెప్పుకొచ్చింది. మేము మా అతిథుల భ‌ద్ర‌త‌కు, సుఖ ప్ర‌యాణానికి చాలా ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఘ‌ట‌న‌లో ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి అంత‌ర్గ‌త విచార‌ణ‌కు ఆదేశించాం అని స్పిరిట్ ఎయిర్‌లైన్స్ వెల్ల‌డించింది.


అమెరికాలోని షాపింగ్ మాల్‌లో కాల్పులు.. ఒక‌రి మృతి


అమెరికాలోని ఓ మాల్‌లో తుపాకీ పేలింది. కొల‌రాడోల‌ని కొల‌రాడో స్ప్రింగ్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా క‌నీసం ఒక‌రు మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాద‌న‌లు చిలికి చిలికి గాలి వానలా మార‌డ‌మే ఈ కాల్పుల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు పేర్కొన్నారు. ఇది ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన దాడి కాద‌ని.. అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగిన‌దేన‌ని తెలిపారు. గ్రూపుల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగి భౌతిక దాడుల‌కు కాల్పుల‌కు దారి తీసింద‌న్నారు.


ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే షాపింగ్ మాల్‌ను మూసేసిన పోలీసులు.. గుంపును చెద‌ర‌గొట్టారు. అనంత‌రం మొత్తం ప‌రిశీలించి చూడ‌గా బుల్లెట్లు త‌గిలి చ‌నిపోయిన వ్య‌క్తిని గుర్తించారు. గాయాల పాలైన ముగ్గురుని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. వీరంతా ఆ గ్రూపుల్లో స‌భ్యులేన‌ని.. బ‌య‌టివారెవ‌రూ ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ‌లేద‌ని భ‌ద్ర‌తా సిబ్బంది వెల్ల‌డించారు.