విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారికి పొన్నవాహన( కల్పవృక్షం) సేవోత్సవం వైభోపేతంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో స్వామివారిని పొన్న వాహనంపై ఆసీనులు చేసి మంగళ హారతీ ఇచ్చారు. అనంతరం ఋత్వికులు, వేద పండిత, భక్త జన పరివార జయ జయ ద్వానాలు, గోవింద నామస్మరణల మధ్య మాడ వీధుల్లో ఊరేగించారు.
సమస్త కోరికలను తీర్చే సువర్ణమయ కల్ప వృక్షంను అధిష్టించిన లక్ష్మీనరసింహుడు భక్తుల కోరికలన్నిటిని తీర్చుతారని ప్రసిద్ధి. కల్పవృక్ష వాహన విహారియైన యాదగిరీషుడిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను తీర్చాలని స్వామి వారికి వేడుకున్నారు. ఉభయ దేవేరులతో కలిసి కల్ప వృక్షం పై మాడ వీధుల్లో విహరించిన స్వామివారికి చెన్నైకి చెందిన శ్రీదేవి నృత్యాలయం, మంజుల రామస్వామి బృందం కళాకారులు కనుల పండగగా తమ భరత నాట్య నృత్య ప్రదర్శనతో నృత్య నీరాజనాలు పలికారు.
డాక్టర్ శివప్రసాద్, మాండలీన్ విద్వాంసుడు యూపీ రాజులు నిర్వహించిన సంగీత కచేరీలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ గీత, ప్రధాన అర్చకులు నల్లంధీగాల్ లక్ష్మీనరసింహాచార్యులు, యాజ్ఞికులు, రుత్వికులు, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.