Site icon vidhaatha

KTR | LB నగర్‌ చౌర‌స్తాకు.. అమ‌రుడు శ్రీకాంతాచారి పేరు: మంత్రి కేటీఆర్

విధాత: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్బీ న‌గ‌ర్ చౌరస్తాకు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో అమ‌రుడైన కాసోజు శ్రీకాంతాచారి పేరును, ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్‌కు మాల్ మైస‌మ్మ పేరును నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్ర‌క‌టించారు. ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా ఎల్‌బీన‌గ‌ర్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే దారిలో నిర్మించిన ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ శ‌నివారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ ఎల్‌బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 9వ ప్రాజెక్టు అని తెలిపారు. ఎస్ఆర్‌డీపీ కింద ఎల్‌బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 12 ప‌నులు రూ. 650 కోట్ల‌తో చేప‌ట్టామ‌ని తెలిపారు.

బైరామ‌ల్‌గూడ‌లో సెకండ్ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్, లెఫ్ట్, రైట్ లూప్‌ల‌ను సెప్టెంబ‌ర్ నాటికి పూర్తి చేసి, ఎన్నిక‌లకు వెళ్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు అందుబాటులోకి రాని స‌మ‌యంలో ఎల్బీ న‌గ‌ర్ చౌర‌స్తా దాటేందుకు 20 నిమిషాల స‌మ‌యం ప‌ట్టేద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స‌మ‌స్య తీరింద‌న్నారు.

ఈ ఫ్లై ఓవ‌ర్లు మాత్ర‌మే కాదు.. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను కూడా మెరుగుప‌రుస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. రాబోయేది మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వమే. ఇక నాగోల్ నుంచి ఎల్‌బీన‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోను తీసుకొస్తాం. ఇటు హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు, అటు ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్తరిస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

గ‌డ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో వెయ్యి ప‌డ‌క‌ల టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రాబోయే సంవ‌త్స‌ర‌న్న‌ర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని కేటీఆర్ చెప్పారు.

Exit mobile version