Harish Rao |
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు ప్రారంభించాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో రైల్వే పెండింగ్ పనుల అంశంపై సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలసి వినతిపత్రం అందజేశారు.
కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్ ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్స్పెక్షన్ పూర్తి కాగానే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ నుండి సిద్దిపేటకి పుష్ పుల్ రైల్ ప్రారంభించి, పఠాన్ చెరు ఎదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్ త్వరగా పూర్తి చేయాలని, కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వే స్టేషన్ పనులు, మాసాయిపెట్ రైల్వే పెండింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Hon’ble Minister Harish Rao Garu discussed key railway developments with Railway GM Arun Kumar Jain.Exciting progress in TS rail infrastructure: Siddipet passenger services,Tirupati-Bangalore route,Hyd-Siddipet rail,Outer Ring Railway, and a new overbridge on Chegunta Medak Road pic.twitter.com/nYcrIIke5e
— Office of Harish Rao (@HarishRaoOffice) September 6, 2023
దేశ చరిత్రలోనే అత్యంత త్వరితగతిన సిద్దిపేట రైల్వే లైన్ పూర్తి అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి రైల్వే శాఖకు ఇవ్వడం వల్లే సాధ్యమైందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఒక్క కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగామని, తెలంగాణలో నిర్మించనున్న ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ లో మెదక్, సిద్దిపేటను కలపాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర పర్యవేక్షణ తోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతం గా పూర్తి చేశామన్నారు.
చేగుంట మెదక్ రోడ్డులో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీఎంను కోరారు. అన్ని విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్, ప్రతిపాదనలను వెంటనే రైల్వే బోర్డ్ కి పంపిస్తామన్నారు. ఈ క్రమంలో రైల్వే బోర్డ్ నీ కూడా త్వరలో కల్వనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.