- కాంగ్రెస్ ఎంపీ వాహనం ధ్వంసం
Rahul Gandhi | కోల్‌కతా : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర వాహనంపై పశ్చిమబెంగాల్‌లో బుధవారం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో వాహనం దెబ్బతిన్నది. అయితే.. రాహుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యాహ్నం మాల్దాకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మాల్దా, ముర్షీదాబాద్‌తోపాటు బిర్భుమ్‌లోని కొన్ని ప్రాంతాలను బుధవారం ఆయన కవర్ చేయాల్సి ఉన్నది. అనంతరం జార్ఖండ్ రాష్ట్రానికి ఆయన వెళ్లాల్సి ఉన్నది.
అయితే.. మధ్యాహ్నం హరిశ్చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాంన్‌గంజ్ సమీపంలో కొందరు వ్యక్తులు రాహుల్ వాహనంపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రాహుల్ ఉన్న బస్సు వెనుక భాగం అద్దాలు పగిలిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ చౌదరి తెలిపారు. ‘ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు’ అని చౌదరి వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన దగ్గర నుంచి కాంగ్రెస్‌తో ఆ పార్టీకి సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘యాత్ర కుచ్‌బిహార్‌లోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అడ్డంకులు ఎదురవుతున్నాయి’ అని చౌదరి చెప్పారు.
గతవారం కుచ్‌బిహార్‌లో రాహుల్‌గాంధీని స్వాగతిస్తూ అంటించిన పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాహుల్ బస చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఇప్పటి వరకూ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో 523 కిలోమీటర్ల యాత్ర సాగింది. డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపుర్దౌర్, ఉత్తర దినాజ్‌పూర్‌లలో యాత్ర కొనసాగింది. మాల్దా, ముర్షీదాబాద్ జిల్లాలు రెండో రోజు కవర్ చేయనున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తర బెంగాల్‌లో యాత్ర పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
దారి మధ్యలో రాహుల్ స్థానికులతో మాట్లాడుతూ సాగారు. బీజేపీ పాలిత అసోం, మణిపూర్‌లో అడ్డంకులు ఎదుర్కొన్నట్టే.. జల్పాయిగురిలో కూడా రాహుల్ యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి. బహిరంగ సభలు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మణిపూర్‌లో జనవరి 14న మొదలైన భారత్ జోడో న్యాయ్ యాత్ర మొత్తం 67 రోజులలో 6,713 కిలోమీటర్లు సాగుతుంది. ఈ క్రమంలో 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా యాత్ర సాగి మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనున్నది.