- మానకొండూర్ మండలం పోచంపల్లిలో 13 ఏళ్ల బాలిక మృతి
- కరీంనగర్, హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స
- పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలింపు అక్కడే బాలిక మృతి
విధాత బ్యూరో, కరీంనగర్: Dog Attack | కుక్కల బెడద కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. గ్రామాల నుండి పట్టణాల వరకు వీధి కుక్కలతో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుక్క కాటు ఘటనలు బయటపడగానే పంచాయతీ, పురపాలక సంఘ సిబ్బంది హడావిడి చేయడం, ఆ తర్వాత షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.
మూడు రోజుల క్రితం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి కరిచాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కోమల్ల మహేశ్వరి(13) కుక్క కాటుకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది.
పోచంపల్లి గ్రామానికి చెందిన కోమల్ల చిరంజీవి, రజితల కూతురు మహేశ్వరి గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో ఏడవ తరగతి చదువుకుంటోంది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న మహేశ్వరిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
కుక్కల దాడిలో గాయపడిన మహేశ్వరికి లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొలుత చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
మహేశ్వరి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. సుమారు 8లక్షల వరకు ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఖర్చు చేశారు.
అయినా ఫలితం లేకపోవడంతో అంతిమంగా మహేశ్వరిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక శుక్రవారం రాత్రి మృతి చెందింది. డబ్బు ఖర్చైనా తమ కూతురు దక్కక పోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరు అవుతున్నారు.