విధాత: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
సునీతా రెడ్డి పిటిషన్ బుధవారం విచారణకు రానున్న దృష్ట్యా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పిటిషన్‌లో సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ పేర్కొంది. కాగా.. నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారని తెలిపింది. తొలుత సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించిన సీఐ శంకరయ్యపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ కూడా ఇచ్చిందని.. దీంతో ఆయన మాట మార్చారని, వాంగ్మూలం కోసం సీబీఐ ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించారని తెలిపింది.
సాక్షులకు ముప్పున్న విషయం కూడా వాస్తవమేనని, ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరించారని వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని వివరించారు.
ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో తాజాగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.