కవిత కేసు విచారణ మార్చి 13కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.

  • Publish Date - February 28, 2024 / 11:42 AM IST

విధాత, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. కవిత తరుపు న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం తమ పిటిషన్‌ను త్వరగా విచారించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.


అయితే వచ్చేనెల 13న విచారిస్తామన్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇంట్లోనే విచారించేలా అదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు.


ఈ పిటిషన్ విచారణ బుధవారం ధర్మాసనం ముందుకురాగా సమయ భావంతో తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై విచారణ ముగిసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలోనే ఈడీని అదేశించింది. మరోసారి విచారణ వాయిదా పడటంతో ఆ అదేశాలు అలాగే కొనసాగుతాయి.


ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీస్‌లతో పాటు తాజాగా సీబీఐ కూడా 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. అయితే తాను పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో పాటు తన పిటీషన్ సుప్రీంలో విచారణలో ఉండటంతో విచారణకు హాజరుకాలేనంటూ కవిత సీబీఐకి లేఖ రాసింది.

Latest News