Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్ నేడు తేలనున్నది. ఏక్‌నాథ్ షిండే వర్గాన్నే అసలు శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారించనున్నది. సీఐజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఎదుట ఉద్ధవ్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనున్నట్లు తెలిపింది.
ఠాక్రే వర్గం తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులపై స్టే ఇవ్వకుంటే గుర్తు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకుంటారని, రాజ్యాంగ ధర్మాసనం ముందు పిటిషన్‌ను జాబితా చేయాలని విజ్ఞప్తి చేశారు. షిండే నేతృత్వంలోని వర్గాన్ని అసలు శివసేనగా గుర్తించిన ఎన్నికల సంఘం దివంగత బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన అవిభక్త శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ గుర్తును కేటాయించింది.
సుప్రీంకోర్టే చివరి ఆశ..
ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద నుంచి అంతా దోచుకున్నారని, పార్టీ పేరును, ఎన్నికల గుర్తు అన్నీ చోరికి గురయ్యాయన్నారు. సదరు వ్యక్తులు ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని, సుప్రీంకోర్టు మా చివరి ఆశ అని.. పార్టీ , చిహ్నాలన్నీ చోరీకి దోపిడీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు పార్టీ, ఎన్నికల గుర్తులను దక్కించుకున్న ఏక్‌నాథ్ షిండే సైతం ఉద్ధవ్ ఠాక్రేకు ధీటుగా పావులు కదుపుతున్నారు. శివసేనకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.