Site icon vidhaatha

Supreme Court | రాజకీయాలను మతంతో పులిమేస్తున్నారు..! సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Supreme Court | రాజకీయ నేతలు తమ అవసరాలకు మతాన్ని వాడుకోవడం మానేసిన క్షణం దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు ఉండవని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలపై దేశం నలుమూలల నుంచి దాఖలైన ఫిర్యాదులను జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. విద్వేష శక్తులైనా, ఇతరులైనా ఇలాంటివి చేయకుండా తమను తాము నియంత్రించుకోవాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రులు జవహార్‭లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి నేతల ప్రసంగాలను ప్రస్తావించింది.

ఆయా నేతల ప్రసంగాలను రిమోట్ ఏరియాల్లోనూ ఉన్నవారు సైతం వినేందుకు ఇష్టపడేవారని, ఇందుకోసం సభలకు తరలివచ్చేవారని గుర్తు చేసింది. రాజకీయ నాయకులు రాజకీయాలను పులిమేస్తున్నారని, ఇదే పెద్ద సమస్య అని పేర్కొంది. రాజకీయాలను, మతాల్ని వేరు చేసినప్పుడు దీనికి ముగింపు అని చెప్పింది. రాజకీయాలను మతానితో కలపడం ప్రమాదకరమని ఇటీవలే తీర్పు చెప్పినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. కోర్టులు మాత్రమే వీటిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటున్నారన్న కోర్టు.. దేశ ప్రజలు ఎందుకు ఒక మతాన్ని కానీ, ఓ వర్గాన్ని కానీ విమర్శించబోమని ప్రతిజ్ఞ చేయరని ప్రశ్నించింది. టీవీల్లో, ఇతర వేదికల ద్వారా కొన్ని అతీత శక్తులు అనేక విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నాయని పేర్కొంది. కానీ.. వాటిపై కేసులు నమోదు చేయడంలో విఫలయత్నాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఈ సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనను కోర్టు ఉదహరించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయన్న కోర్టు.. వీటితో ఈ ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ హిందూ సంస్థల ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించడంలో విఫలమైనందుకు దాఖలైన ధిక్కార పిటిషన్‌పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు ఏప్రిల్ 28వ తేదీని నిర్ణయించింది.

Exit mobile version