Kasargod | మాక్‌ పోలింగ్‌లో బీజేపీకి అదనంగా ఓట్లు!

కేరళలోని కాసరగోడ్‌లో నిర్వహించిన మాక్‌పోలింగ్‌ సందర్భంగా ఈవీఎంలలో బీజేపీకి అదనంగా ఓట్లు పోలైనట్టు అడ్వొకేట్‌ ప్రశాంత్‌భూషణ్‌ చేసిన ఆరోపణలను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది

  • Publish Date - April 18, 2024 / 04:46 PM IST

పరిశీలించాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ : కేరళలోని కాసరగోడ్‌లో నిర్వహించిన మాక్‌పోలింగ్‌ సందర్భంగా ఈవీఎంలలో బీజేపీకి అదనంగా ఓట్లు పోలైనట్టు అడ్వొకేట్‌ ప్రశాంత్‌భూషణ్‌ చేసిన ఆరోపణలను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌)లోని చీటీలతో ఈవీఎంలో పోలైన మొత్తం ఓట్లను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్‌ విచారణలో భాగంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆశించినది జరగడం లేదేమోననే సంకోసం ఎవరిలోనూ ఉండకూడదని ఈసీని ఉద్దేశించి పేర్కొన్నది. కేరళలోని కాసరగోడ్‌ నియోజకవర్గంలో ఈవీఎంలతో నిర్వహించిన మాక్‌ పోలింగ్‌పై వచ్చిన ఫిర్యాదులపై మనోరమ ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక వార్తను ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కనీసం నాలుగు ఈవీఎంలలో బీజేపీకి అదనంగా ఓట్లు పడ్డాయని అధికార వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్‌) ఐక్య ప్రజాస్వామిక సంఘటన (యూడీఎఫ్‌) నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినట్టు ఆ వార్తలో ఉన్నది.

ఈవీఎం, వీవీప్యాట్‌ల పని తీరు గురించి కూడా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటింగ్‌ యంత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చే ముందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌పోలింగ్‌ నిర్వహించి వాటిని తనిఖీ చేస్తామని ఎన్నికల సంఘం బదులిచ్చింది. ఓటరు వీవీప్యాట్‌ స్లిప్‌ను తీసుకుని, బ్యాలెట్‌ బాక్సులో తానే వేసేందుకు అనుమతించాలని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది నిజాం పాషా కోరారు. ఇది ఓటరు గోప్యతను ప్రభావితం చేస్తుందా? అని జస్టిస్‌ ఖన్నా ప్రశ్నించగా.. పాషా బదులిస్తూ.. ఓటరు హక్కును ఓడించేందుకు ఓటరు గోప్యతను ఉపయోగించరాదని అన్నారు.

మంగళవారం కూడా ఈవీఎంల విషయంలో విచారణ జరిపిన కోర్టు.. దేశంలోని భారీ జనాభా దృష్ట్యా ఓట్లను భౌతికంగా లెక్కించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్న పిటిషనర్‌ వాదనలపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు బదులు మళ్లీ బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఓటింగ్‌కు మళ్లాలని ప్రశాంత్‌ భూషణ్‌ వాదించగా.. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పందిస్తూ.. ‘మనం 60లలో ఉన్నాం. బ్యాలెట్‌ పత్రాలు ఉన్నప్పుడు ఏం జరిగేందో మీరు మర్చిపోయారేమో.. మేం మర్చిపోలేదు’ అని వ్యాఖ్యానించారు. అనేక ఐరోపా యూనియన్‌ దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి బ్యాలెట్‌ పద్ధతికి మారాయంటూ భూషణ్‌ చేసిన వాదనలను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Latest News