Tashigang | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ బూత్‌.. 52 మంది కోసం మంచుకొండల్లో ఏర్పాటు.. ఎక్కడో తెలుసా..!

  • Publish Date - March 21, 2024 / 11:44 AM IST

Tashigang : భారత దేశంలోని ఓ పోలింగ్‌ బూత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ పోలింగ్ బూత్‌ మంచుకొండల్లో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ నివసించే 52 మంది ఓటర్ల కోసం 2019లో ఈ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. అంతకుముందు అక్కడి ప్రజలు మంచుకొండల్లో చాలాదూరం నడిచి పొరుగు గ్రామంలో ఓటు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు తమ దగ్గరే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయడంతో వారికి సమీప గ్రామానికి నడిచి వెళ్లాల్సిన శ్రమ తప్పింది. ఇప్పటికే రెండు సార్లు అక్కడ పోలింగ్‌ జరిగింది. ఈ లోక్‌సభ ఎన్నికలతో మూడోసారి పోలింగ్‌ జరగబోతున్నది. ఇంతకూ ఈ పోలింగ్ బూత్‌ ఎక్కడుందనేగా మీరు ఆలోచిస్తున్నారు..! అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి…

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మంచు పర్వతాలపై సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తాషిగ్యాంగ్ అనే చిన్న గూడెం ఉంది. అక్కడి జనాభా ప్రస్తుతం 100 లోపే. ఓటు హక్కు ఉన్నవాళ్లు 52 మంది మాత్రమే. గతంలో ఇంతకంటే తక్కువగా ఉండేవాళ్లు. దాంతో అక్కడ పోలింగ్ బూత్‌ ఏర్పాటు చేయలేదు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తొలిసారి అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తాషిగ్యాంగ్‌ ప్రజలు 2019లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2021లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటు వేశారు. ఇప్పుడు మూడోసారి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.

భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం తాషిగ్యాంగ్‌ పోలింగ్‌ బూత్‌ను మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డుకు 200 మీటర్ల దూరంలోనే ఉన్నా ప్రస్తుతం అడుగు మందం మంచు కురుస్తోంది. అందుకే ఎన్నికల సంఘం జూన్ 1న ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా అక్కడ పోలింగ్‌ నిర్వహిస్తున్నది.

తాషిగ్యాంగ్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయక ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. తాషిగ్యాంగ్ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటుకు ముందు.. హిక్కిమ్‌ పోలింగ్ బూత్‌ దేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్‌గా ఉండేది. తాషిగ్యాంగ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు 45 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు. 2021లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. రెండు ఎన్నికల్లోనూ అక్కడ 100 శాతం ఓటింగ్‌ నమోదైంది.

Latest News